కులం వివరాలడిగితే తప్పేంటి?

What Is wrong For Asking Caste Details Ts High Court Quotation Over Dharani Petition - Sakshi

పాఠశాల స్థాయి నుంచే ఆ వివరాలను ఇచ్చాం కదా..

‘ధరణి’కి కులం వివరాలు అడిగారన్న పిటిషన్‌పై హైకోర్టు

కౌంటర్‌ దాఖలు చేయాలని సర్కార్‌కు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా కులం వివరాలు అడిగితే తప్పేంటని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను హైకోర్టు ప్రశ్నించింది. ‘గత 60 ఏళ్లుగా మనం పాఠశాల స్థాయి నుంచి కులం వివరాలు సమర్పిస్తూనే ఉన్నాం కదా, అలాంటప్పుడు కులం వివరాలు ఇవ్వడానికి ఇబ్బందేంట’ని పేర్కొంది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను సమర్పించాలని, అందులో కులం, ఆధార్‌ వివరాలు నమోదు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం కులం, ఆధార్‌ వివరాలను అడుగుతోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కులం, ఆధార్‌ వివరాలను ఏ చట్టం కింద అడుగుతున్నారో చెప్పకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పుట్టుస్వామి తీర్పు ప్రకారం ఆధార్‌ వివరాలను అడగడానికి వీల్లేదన్నారు.

ఈ నెల 25లోగా ఈ వివరాలు సమర్పించాలంటున్నారని వివరించారు. ధరణి కోసం వివరాలు సమర్పించేందుకు డెడ్‌లైన్‌ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. కేంద్రం సూచనల మేరకు ఈ వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటూ ధర్మాసనం విచారణను కొద్దిసేపు వాయిదా వేసింది. ‘‘కులం చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది. కులం చెప్పుకోవడాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా భావించాలి. వ్యక్తులను గుర్తించేందుకు ఇది తప్పనిసరి. ఆధార్‌ వివరాలను ఎవరికీ వెల్లడించకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆధార్‌ వివరాలు వెల్లడించడం వల్ల ఏం నష్టం’’అని ధర్మాసనం ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించింది. ఈ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ప్రకాశ్‌రెడ్డి కోరగా ధర్మాసనం నిరాకరించింది. పూర్తి వివరాలతో ఈ నెల 31లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 3కు వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top