
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏముందంటే..
50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9పై స్టే విధించిందని తెలిపింది. ఓబీసీ సమగ్ర వివరాలను కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించామని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం.
వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శనివారం నుంచి పదిరోజుల పాటు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతం లోపే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిగితే వాటిని కూడా కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.