దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో నిర్ణయం
నిర్దేశించిన ప్రతి నిబంధనలో మెరిట్‌కే ప్రాధాన్యం
విద్యానిధి యూనిట్లను రెట్టింపు చేసిన నేపథ్యంలో సంక్షేమ శాఖల దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో రాయితీ అందిస్తున్న పథకం ఓవర్సీస్ విద్యానిధి పథకం. దీనికింద ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా లబ్ధిదారులను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది.
తాజాగా ఈ పథకం కింద కోటాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా గతేడాది వరకు 1100 మంది విద్యార్థులకు సాయం అందిస్తుండగా... తాజాగా కోటా పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 1900కు పెరిగింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి.
ప్రతి కేటగిరీలో మెరిట్ కీలకం
విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించేందుకు బ్యాచ్‌లర్ డిగ్రీలో మెరుగైన మార్కులు, ఐఈఎల్‌టీఎస్/ టోఫెల్ పరీక్షలో మెరిట్ సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పరిగణించి అర్హత కల్పించేవి. బీసీ సంక్షేమ శాఖలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో మరింత లోతుగా మెరిట్‌ను పరిశీలించి అర్హతలు ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ శాఖలకు పోటీ తీవ్రం కానుంది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 1:3 చొప్పున దరఖాస్తులు ఉంటే... బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1:20 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు సంక్షేమ శాఖల పరిధిలో కోటాను భారీగా పెంచింది. తాజాగా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా... క్షేత్రస్థాయి నుంచి స్పందన భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వడపోతకు సంక్షేమ శాఖలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి.
అభ్యర్థులను అన్ని కేటగిరీల్లోనూ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ముందుగా అభ్యర్థి సాధించిన డిగ్రీ మార్కులను విశ్లేషిస్తారు. ఆ తర్వాత జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో మార్కులను మెరిట్ ఆధారంగా పరిశీలిస్తారు. అనంతరం ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ మార్కుల్లోనూ మెరిట్ ఆధారంగా వడపోస్తారు. ఇందుకు సంబంధించి నిబంధనలను సంక్షేమ శాఖలు త్వరలో సవరించనున్నట్లు తెలుస్తోంది.


