breaking news
vidyanidhi
-
‘విద్యానిధి’ కఠినతరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ఎక్కువ మొత్తంలో రాయితీ అందిస్తున్న పథకం ఓవర్సీస్ విద్యానిధి పథకం. దీనికింద ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల ఆధారంగా లబ్ధిదారులను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. తాజాగా ఈ పథకం కింద కోటాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసింది. మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా గతేడాది వరకు 1100 మంది విద్యార్థులకు సాయం అందిస్తుండగా... తాజాగా కోటా పెంపుతో లబ్ధిదారుల సంఖ్య 1900కు పెరిగింది. దీంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సంక్షేమ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ప్రతి కేటగిరీలో మెరిట్ కీలకం విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించేందుకు బ్యాచ్‌లర్ డిగ్రీలో మెరుగైన మార్కులు, ఐఈఎల్టీఎస్/ టోఫెల్ పరీక్షలో మెరిట్ సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు పరిగణించి అర్హత కల్పించేవి. బీసీ సంక్షేమ శాఖలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో మరింత లోతుగా మెరిట్‌ను పరిశీలించి అర్హతలు ఖరారు చేసేవారు. కానీ ఇప్పుడు అన్ని సంక్షేమ శాఖలకు పోటీ తీవ్రం కానుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో 1:3 చొప్పున దరఖాస్తులు ఉంటే... బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 1:20 చొప్పున దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మూడు సంక్షేమ శాఖల పరిధిలో కోటాను భారీగా పెంచింది. తాజాగా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా... క్షేత్రస్థాయి నుంచి స్పందన భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వడపోతకు సంక్షేమ శాఖలు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. అభ్యర్థులను అన్ని కేటగిరీల్లోనూ మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ముందుగా అభ్యర్థి సాధించిన డిగ్రీ మార్కులను విశ్లేషిస్తారు. ఆ తర్వాత జీఆర్ఈ/జీమ్యాట్‌లో మార్కులను మెరిట్ ఆధారంగా పరిశీలిస్తారు. అనంతరం ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల్లోనూ మెరిట్ ఆధారంగా వడపోస్తారు. ఇందుకు సంబంధించి నిబంధనలను సంక్షేమ శాఖలు త్వరలో సవరించనున్నట్లు తెలుస్తోంది. -
అంతొస్తోందిగా.. ఎంతిస్తావు.?
‘కంగ్రాట్స్ బాబు.. విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికయ్యావు. రూ.20 లక్షలొస్తాయి. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఇంత డబ్బు వస్తోంది కదా? మరి నాకెంత ఇస్తావ్? ఓసారి ఆలోచించి నా వాటా తేల్చేయ్’ – లబ్ధిదారునితో ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ అధికారి అన్న మాటలివి. సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకంతో సాకారం చేస్తోంది. ఏటా 1,000 మందికి అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. 2015–16 వరకు ఎస్సీ, ఎస్టీలకే పథకం అమలవగా తర్వాత బీసీ, ఈబీసీ, మైనారిటీలకు అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం.. బీసీ, ఈబీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు. ఆయా సంక్షేమ శాఖల వారీగా పథకాలు అమలవు తున్నాయి. విద్యార్థుల ఎంపిక రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నతాధి కారుల సమక్షంలో పక్కాగా జరిగినా.. నిధులు మాత్రం జిల్లా స్థాయి నుంచి ఇస్తున్నారు. ఈ తంతే విద్యార్థులకు గుదిబండగా మారుతోంది. వాటా ఇవ్వందే నిధులు ఇవ్వమంటూ కొందరు సంక్షేమ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో వారు అడిగిన మొత్తానికి ఒప్పుకోవాల్సి వస్తోంది. ఎంపిక ఇలా.. పంపిణీ అలా.. విదేశాల్లో పీజీ చేయాలనుకున్న విద్యార్థి తొలుత విద్యానిధి పథకం కింద ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ చేసి అర్హత నిర్ధారిస్తారు. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సంచాలకులు, సంయుక్త సంచాలకుల సమక్షంలో ప్రక్రియ పక్కాగా జరుగుతుంది. అనంతరం అర్హుల పేర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అర్హత సాధించిన విద్యార్ధి నిర్దేశిత వర్సిటీలో ప్రవేశం పొందిన తర్వాత సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి తనిఖీ అధికారులు విద్యార్థి వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తారు. మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం విదేశీ వర్సిటీలో ప్రవేశ పత్రాలు, మార్కుల మెమోల ఆధారంగా ఆర్థిక సాయం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణులయ్యాక తొలి విడత రూ.10 లక్షలు, రెండో సంవత్సరంలో సెమిస్టర్ పరీక్షల సమయంలో మిగతా రూ.10 లక్షలు చెల్లిస్తారు. 10 శాతం ఇచ్చుకోవాల్సిందే! ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత, ప్రతిభ ఆధారంగా విద్యానిధి పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధికారులు.. వాటాలు ఆర్జిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలోనే విద్యార్ధి కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం డిమాండ్ చేస్తూ రేటు ఫిక్స్ చేస్తున్నారు. తొలి, రెండో విడత చెల్లింపుల సమయంలో సొమ్ము అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కమీషన్ ఇస్తేనే నిధుల జమకు మార్గం సుగమమవుతుంది. లేదంటే ఫైలుకు కొర్రీలేస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తారు. ఇలా ఏటా రూ.10 కోట్ల వరకు కమీషన్ల రూపంలో లబ్ధిదారులు నష్టపోతున్నారు. -
విద్యానిధి పరపతిని పెంచాలి
– రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర కాకినాడ సిటీ : జిల్లాలో ఏర్పాటైన విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాల ద్వారా విద్యానిధి పరపతి పెరగాలని ట్రస్ట్ గౌరవ «అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధ్యక్షతన విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలోని పేద, బడుగు వర్గాలు, నిరాశ్రయులైన కుటుంబాల్లోని పిల్లలకు విద్యనందించేందుకు 2012వ సంవత్సరంలో విద్యానిధి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సహాయం చేశామన్నారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు కోసం ఐ.పోలవరం మండలానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఒక రోజు వేతనం అందించారని తెలియజేస్తూ వారిని అభినందించారు. ట్రస్ట్ æనిధులతో పాటు బ్యాంకులు కూడా రుణ సదుపాయం కల్పిస్తే విద్యానిధి పరపతి పెరుగుతుందన్నారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ ట్రస్ట్‌కు సీఎస్ఆర్ నిధులు సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో 2017–18 సంవత్సరాల్లో ఇంటర్, ఉన్నత విద్యలో చేరే విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా చేపట్టవల్సిన అంశాలను చర్చించారు. ట్రస్ట్ ద్వారా విద్యారుణం అందించడానికి, ట్యూషన్ సెంటర్లు, లైబ్రరీ స్టడీసెంటర్లు నిర్వహణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు తాడి నాగదుర్గా, సెక్రటరీ ఎస్ఎం లక్ష్మి, కోశాధికారి ఎం.మేరీ, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం భాస్కరరావు, ఎల్డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, బీసీ వెల్ఫేర్ డీడీ ఎం.చినబాబు పాల్గొన్నారు.


