గ్లోబల్‌ కలలు సరే... మరి లోకలో! | Universities in telugu states : think for local dreams along with global | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ కలలు సరే... మరి లోకలో!

Apr 22 2025 10:40 AM | Updated on Apr 22 2025 10:40 AM

Universities in telugu states : think for local dreams along with global

రాష్ట్రానికి ప్రపంచ విద్యాసంస్థలను తీసు కొస్తామని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విద్యాశాఖా మాత్యులు ఆర్భాటంగా ప్రకటించడం పరిపాటిగా మారి పోయింది. గ్లోబల్‌ సంస్థలను తీసుకొస్తే కాదనే వారెవరు? మరి ఇప్పటికే ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీస సౌకర్యాల కల్పన చేయాలన్న సంగతే మర్చిపోతే ఎలా? అధ్యాపకుల కొరతతో విశ్వవిద్యాలయాలు ఒప్పంద అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. విద్యార్థుల సమస్యలు, శిక్షణా అవసరాల కంటే రాజకీయ అజెండాలకే విశ్వ విద్యాలయాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలను నిరోధించే వేదికలుగా, ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రచార కేంద్రాలుగా మారుతున్న ఈ విద్యా సంస్థలు తమ పరిపక్వతను కోల్పో తున్నాయి. విశ్వవిద్యాలయాల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. ఎటువంటి స్పష్టమైన పాలనా విధానం లేకుండా, అనుసంధాన కార్యక్రమాలు లేకుండా, విశ్వవిద్యాలయాలు కేవలం తమ తమ అస్తిత్వం కొనసాగించేందుకు మాత్రమే పరిమిత మవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, తెలుగు రాష్ట్రాల విద్యా వ్యవస్థ మరింత దిగజారిపోతుంది.

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం మంజూరు చేసిన ‘గిరిజన విశ్వవిద్యాలయా’ లు పూర్తి స్థాయి క్యాంపస్‌లుగా రూపుదిద్దుకోలేదు. తాత్కాలిక అద్దె భవనాల్లోనే ఇంకా నెట్టుకొస్తున్నాయి. ఏర్పాటు చేసి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా వీటి పరిస్థితి కొనసాగుతోంది. ఏ ఉద్దేశ్యంతో అయితే ఈసంస్థలు ఏర్పాటు చేయబడ్డాయో వాటిని అందుకోవడంలో విఫలమవు తున్నాం. కానీ వీటి గురించి ఆలోచించే నాథుడే లేకపోవడం గమనార్హం. విద్య, పరిశోధనల వైపు దృష్టి సారించాల్సిన అధ్యాపకులు పదవుల కోసం పాకులాడుతూ విద్యా వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. 

మన విశ్వవిద్యాలయాల్లో గ్లోబల్‌ (అంతర్జాతీయ) ప్రమాణాలను కల్పించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. అధ్యాపకుల నియామకాన్ని తక్షణం చేపట్టాలి. పూర్తి స్థాయి అధ్యాపకులను నియమించి, వారి శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్వ విద్యాలయాల్లో పరిశోధన నిధులను పెంచాలి. పరిశోధనాపత్రాలను ప్రచురించేలా ప్రోత్సహించడంతోపాటు, విదేశీ విశ్వవిద్యాలయాలతో అను సంధానం చేయాలి. ఆధునిక మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల స్టార్ట్‌అప్‌లను ప్రోత్సహించే విధంగా నూతన విధానాలను అమలు చేయాలి. విశ్వవిద్యాలయాల పాలనలో పారదర్శకతను పెంచి, అకడమిక్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షిస్తూ, రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల విధానాన్ని అనుసరించి, విద్యార్థులకు పరిశ్రమ అను భవాన్ని పెంచే ఇంటర్న్‌షిప్‌లు, కో-ఆపరేటివ్‌ ప్రోగ్రామ్‌లను అమలు చేయడం అత్యవసరం. పరిశ్రమతో అనుసంధానం పెంచి, విద్యార్థులను వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి సిద్ధం చేయాలి. విద్యాబోధన, పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి...ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాలి.  ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యా సంస్థలతో పోటీ పడటమే కాకుండా, పరిశోధన, నూతన ఆవిష్కరణల కేంద్రాలుగా మారతాయి. అప్పుడు ఎక్కడి నుంచో కొత్తగా విశ్వవిద్యాలయాలను, సంస్థలను తీసుకు రావలసిన అవసరమే ఉండదు.

-డా.తారకేశ్వరరావు ఇప్పిలి 
(అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విజయనగరం)
 

Advertisement
 
Advertisement
Advertisement