రాష్ట్రానికి రెండు కొత్త మెడికల్‌ కాలేజీలు | Two new medical colleges for the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రెండు కొత్త మెడికల్‌ కాలేజీలు

Jun 28 2026 1:16 AM | Updated on Jun 28 2026 1:16 AM

Two new medical colleges for the state

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వైద్య విద్యను విస్తరించే దిశగా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రానికి మరిన్ని మెడికల్‌ సీట్లు రాబోతున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 41 కొత్త మెడికల్‌ కాలేజీలతో పాటు 10,650 అదనపు ఎంబీబీఎస్‌ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలుపగా, ఇందులో తెలంగాణకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది. రాష్ట్రంలో రెండు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి లభించగా, వాటి ద్వారా 200 కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ కొత్త మెడికల్‌ కాలేజీలు ఎక్కడ రాబోతున్నాయనే విషయాన్ని ఎన్‌ఎంసీ స్పష్టం చేయలేదు. 

అలాగే తెలంగాణలో ఉన్నత వైద్య విద్యకు కూడా ఎన్‌ఎంసీ తగిన అవకాశం కల్పించడం గమనార్హం. 2026–27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 60 కొత్త డీఎం, ఎంసీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ పీజీ సీట్లను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల తయారీకి మరింత అవకాశం ఏర్పడనుంది. అయితే, తెలంగాణలో అనుమతి పొందిన రెండు కొత్త మెడికల్‌ కాలేజీల పేర్లు, 60 డీఎం/ఎంసీహెచ్‌ సీట్లు ఏయే ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేటాయించారనే పూర్తి వివరాలను ఎన్‌ఎంసీ అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించాల్సి ఉంది. మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.   

వైద్యవిద్యలో మార్పులు
పీజీ డిప్లొమా కోర్సుల నిలిపివేత 
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని వైద్యవిద్యలో కీలక మార్పునకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎమ్‌సీ) శ్రీకారం చుట్టింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులను దశలవారీగా నిలిపివేసి, వాటి స్థానంలో ఎండీ, ఎంఎస్‌ డిగ్రీ కోర్సులను కొనసాగించనుంది. పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 2026–27 విద్యాసంవత్సరమే చివరిదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇకపై స్పెషలిస్టు వైద్య విద్య ప్రధానంగా ఎండీ, ఎంఎస్‌ డిగ్రీల ఆధారంగానే ఉంటుంది. స్పెషలిస్టు వైద్యవిద్యను దేశవ్యాప్తంగా ఒకే విధానంలో నిర్వహించడానికే ఈ మార్పు. ఈ నిర్ణయం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌–2023 నిబంధనలకు అనుగుణంగా తీసుకున్నట్లు ఎన్‌ఎమ్‌సీ పేర్కొంది. 

ఎంఏఆర్‌బీకి దరఖాస్తు 
ప్రస్తుతం పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహి స్తున్న వైద్య కళాశాలలు వాటిని సంబంధిత ఎండీ, ఎంఎస్‌ కోర్సులుగా మార్చుకోవడానికి మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎంఏఆర్‌బీ)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్, కాలపట్టికను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement