కాంగ్రెస్‌కు ఇద్దరు ఎంపీల గుడ్‌బై! 

Two Congress MPs From Telangana To Quit It Soon Says Minister KTR - Sakshi

రాహుల్‌ యాత్ర రాష్ట్రంలో ప్రవేశించేటప్పటికే.. 

మంత్రి కేటీఆర్‌ వెల్లడి 

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ఓ పెద్ద జోక్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాద యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పటికి తెలంగాణకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్తారని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారు పార్టీ మారతారన్న సమాచారం మీకు (మీడి యా) ఇస్తున్నానని, ఏ పార్టీలో చేరతారో మీరే తెలుసుకోండంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘భారత్‌ జోడో యాత్ర కాదు. ముందు కాంగ్రెస్‌ జోడో చూసుకోవాలి. రాహుల్‌ పాదయాత్ర ప్రారంభించగానే గోవాలో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పోటీ చేస్తారనగానే.. అక్కడి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకం అయ్యింది. అక్కడి ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఓ పెద్ద జోక్‌.

అక్కడ పోటీ ఏముంది..? 76 ఏళ్ల పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగిపోయి 80 ఏళ్ల వృద్ధుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడు అవుతారంట. యువకులతో కూడిన భారత్‌లో 80 ఏళ్లున్న వ్యక్తి ఓ ప్రధాన పార్టీకి అధ్యక్షుడు కావడం విడ్డూరం. గతంలో సీతారాం కేసరి ఉన్నప్పుడు పార్టీ ఎలా ఉందో అలానే ఉంటుంది..’అని ఎద్దేవా చేశారు. 

రాహుల్‌ 15 నెలలున్నా ఎలాంటి ప్రభావం ఉండదు 
‘ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అట్టర్‌ ఫ్లాప్‌. అందుకే దేశంలో రాజకీయ శూన్యత. కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికి కోసం పాకులాడుతోంది. దేశంలో ఎక్కడా ఆ పార్టీ కనీస పోటీ ఇవ్వని పరిస్థితి. 2024 ఎన్నికల తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ తెలంగాణలో 15 రోజులున్నా, 15 నెలలున్నా ఎలాంటి ప్రభావం ఉండదు. కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తారు. ఇక్కడ కార్యక్రమాలు చూసి సైలెంట్‌ అవుతారు..’అని కేటీఆర్‌ అన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top