రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం | Tragic Death Of A Couple In Road Accident After Car Hits Parked Lorry, Son And Daughter-in-Law Hospitalised | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

Jun 3 2026 9:33 AM | Updated on Jun 3 2026 9:57 AM

Tragic Death of a Couple in Road Accident

సిద్దిపేటఅర్బన్‌: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందగా, కారులో ఉన్న కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి శివారులో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొలిపాక రవిచంద్రకాంత్‌ (49) కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం సిద్దిపేటకు బతుకుదెరువుకు వచ్చాడు. 

గోల్డెన్‌ ఫ్రేమ్స్‌ పేరిట ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటో ఫ్రేమ్స్‌ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సునీత (45), కుమారుడు అజయ్, కూతురు ఉన్నారు. అజయ్‌కు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. వేసవి కావడంతో స్వగ్రామం మణుగూరుకు నాలుగు రోజుల క్రితం వెళ్లారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు కారులో సిద్దిపేటకు బయల్దేరారు. ఉదయం 9గంటల ప్రాంతంలో మిట్టపల్లి శివారులోకి రాగానే వేబ్రిడ్జి పక్కన నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారు సగ భాగం చొచ్చుకెళ్లింది. 

దీంతో కారు నడుపుతున్న రవిచంద్రకాంత్, అతని భార్య సునీత అక్కడికక్కడే మృతి చెందారు. వెనక సీట్లో కూర్చున్న కొడుకు అజయ్, కోడలు అర్చన తలకు తీవ్ర గాయాలు కాగా కుడి కాలు కూడా విరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అర్చన తండ్రి అంకం ప్రకాశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement