వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది! | Traffic Challans Issued Using Artificial Intelligence Hyderabad Telangana | Sakshi
Sakshi News home page

వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది!

Jul 2 2026 1:10 PM | Updated on Jul 2 2026 1:25 PM

Traffic Challans Issued Using Artificial Intelligence Hyderabad Telangana

ఇక కృత్రిమ మేధతోనే ట్రాఫిక్‌ చలాన్లు జారీ

నేరుగా మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్‌కు వివరాలు

బేగంపేటలో 2 నెలల పైలెట్‌ ప్రాజెక్ట్‌ పూర్తి

సత్ఫలితాలు రావడంతో మల్కాజ్‌గిరిలో అమలుకు నిర్ణయం

75 సీసీటీవీ కెమెరాలకు ఏఐ సాంకేతికత జోడింపు

ఏఐ ట్రాఫిక్‌ చలానా నమూనా చిత్రం

వాహనదారులూ జాగ్రత్త..ఇక మీరు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే ‘ఏఐ’ పట్టేస్తుంది. ట్రాఫిక్‌ పోలీసులు లేరు కదా అనుకుని..మీరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక నడవదు. మీ ఉల్లంఘనలను ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. చలాన్‌ వడ్డిస్తాయి. ఆ సమాచారం మీకు నేరుగా వాట్సప్‌ ద్వారానో..మెసేజ్‌ రూపంలోనో..మెయిల్‌గానో వచ్చేస్తుంది. – సాక్షి, హైదరాబాద్‌

ట్రాఫిక్‌ విభాగంలోనూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని మల్కాజ్‌గిరి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేటలో రెండు నెలల పాటు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహించిన పోలీసులు..సత్ఫలితాలు రావడంతో కమిషనరేట్‌లో అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే  వాహనదారులను ఆయా రోడ్లపై ఉన్న ‘ఏఐ సీసీటీవీ కెమెరాలు’ గుర్తించి..వివరాలను నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్వర్‌కు పంపిస్తాయి. అక్కడున్న సిబ్బంది ట్రాఫిక్‌ ఉల్లంఘన, ప్రమాదం తీరు, వాహనం నంబర్, యజమాని వివరాలు తదితరాలను విశ్లేషించి.. యాక్సెప్ట్‌ చేయగానే నేరుగా వాహనదారుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్, వాట్సాప్‌ రూపంలో అలాగే ఈ–మెయిల్‌ ఐడీలకు మెయిల్‌ రూపంలో చలాన్‌ వెళ్లిపోతుంది.

1.27 లక్షల కేసులు.. రూ.6.73 కోట్ల జరిమానా
అన్ని రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ఒకేసారి దృష్టిపెట్టడంతో వాహనదారులకు అవగాహన రావడం లేదని భావించిన పోలీసులు.. ప్రతి రోజూ ఒకట్రెండు ఉల్లంఘనలు తీసుకొని ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో కమిషనరేట్‌ పరిధిలో 1,27,760 కేసులు నమోదు కాగా.. రూ.6.73 కోట్ల జరిమానాలు విధించారు. వీటిల్లో అత్యధికంగా అక్రమ పార్కింగ్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, నంబర్‌ ప్లేట్‌ ఉల్లంఘనలు ఉన్నాయి.

కీలక ప్రాంతాల్లో 75 కెమెరాలు
బేగంపేటలో రెండు బహుళ జాతి కంపెనీల సాంకేతిక, నిధుల సహాయంతో నాలుగు సీసీటీవీ కెమెరాలకు ఏఐ జోడించి, రెండు నెలలు పరీక్షించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, ప్రమాదాల తీరు, వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్లు గుర్తించడంలో సత్ఫలితాలొచ్చాయి. దీంతో మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లోని కీలక కూడళ్లు, ప్రాంతాలలో 75 కెమెరాలకు ఏఐ జోడించి, వినియోగించుకోనున్నారు. ఈ ఏఐ ట్రాఫిక్‌ పోలీసు విభాగంలోకి ఇటీవల కొత్తగా నియమితులైన ఎస్‌ఐలలో బీటెక్, ఎంటెక్‌ చదివిన వారిని తీసుకోనున్నారు.

వారి సేవలు ఇతర విభాగాల్లో.. 
ఇప్పటివరకు రోడ్లపై ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్‌ పోలీసులు ఉండేవారు. ఇక నుంచి ఏఐ ట్రాఫిక్‌ చలాన్లు జారీ చేయనుండటంతో.. సిబ్బంది సేవలను రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ వంటి ఇతర విభాగాలలో వినియోగించుకోనున్నాం. – రాహుల్‌ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్‌–1, మల్కాజ్‌గిరి 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement