30 నుంచి 50 వేల మెజారిటీతో గెలిచేది కాంగ్రెస్ పార్టే
విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. నోటాకు వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. 30 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఆదివారం యూసుఫ్‌గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించినా, ఉపఎన్నికలో మాత్రం ఫేక్ సర్వేలు చేసుకొని భ్రమ పడుతుందని ఎద్దేవా చేశారు.
రెండేళ్ల పాలన చూసి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థిపై విష ప్రచారమని దుయ్యబట్టారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని, కానీ, మాగంటి ఇంటి వ్యవహారం బజారున పడింది కాబట్టి కేటీఆర్ మాగంటి తల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందన్నారు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచి్చందని, పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన నవీన్‌యాదవ్ సేవకుడని, అతడిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలో రాగానే రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీనవర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చిందని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను మూడు పర్యాయాలు ప్రజలు గెలిపించినా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ ఉపఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
మంత్రి శ్రీహరి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఇక్కడ చేసింది ఏమీ లేదని, గెలిపిస్తే కూడా చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్‌తోనే మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కారుకు ఓటు వేస్తే కమలంకు ఓటు వేసినట్టేనన్నారు. ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తూ లబి్ధపొందాలని బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయతి్నస్తున్నాయని ఆరోపించారు.


