ఒకేరోజు మూడు పరీక్షలు

Three Exams In One Day: TSPSC And Central Institutes Exams On 26th Feb - Sakshi

ఈనెల 26న టీఎస్‌పీఎస్సీ, కేంద్ర సంస్థల పరీక్షలు

డీఏఓ, జేఈ, పీఆర్‌టీ పరీక్షలతో అభ్యర్థుల అయోమయం

ఏళ్ల తర్వాత ప్రకటన వెలువడినా పరీక్ష రాయలేని పరిస్థితి

డీఏఓ పరీక్ష తేదీలో మార్పులు కోరుతున్న అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఎన్నో ఆశలతో సన్నద్ధమైన అభ్యర్థులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నెల 26వ తేదీన జరిగే పరీక్షలను చూస్తే రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకే పరిమితమవాల్సిన పరిస్థితి నెలకొంది.

26న తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డీఏఓ (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. 53 డీఏఓ ఉద్యోగ ఖాళీల భర్తీకి దాదాపు పదిహేనేళ్ల తర్వాత ప్రకటన వెలువడింది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉన్న ఈ పోస్టులు అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షను ఈనెల 26వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌­టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనుంది. అయితే అదే రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇక కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ) ఉద్యోగ అర్హత పరీక్ష ఉండగా.. అదే రోజున స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పేపర్‌–2 పరీక్షను సైతం నిర్వహిస్తోంది. సాధారణంగా ఉద్యోగ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కేంద్రీయ నియామక సంస్థలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర స్థాయి ఉద్యో­గాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగరంగ నిపుణులు చెపుతున్నారు. ఒకవేళ ముందస్తుగా రాష్ట్ర నియామక సంస్థలు పరీక్షల తేదీలను ప్రకటిస్తే.. అవసరమైన పక్షంలో అభ్యర్థుల ప్రయోజనాల రీత్యా వాటిని మార్పు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న జరిగే డీఏఓ, పీఆర్‌టీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు డీఏఓ పరీక్ష తేదీలో మార్పు చేయాలని కోరుతున్నారు.

ఏ పరీక్ష రాయాలో అర్థం కావడంలేదు...
డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగంతో పాటు కేంద్రీయ విద్యాలయాల్లో పీఆర్‌టీ ఉద్యోగ పరీక్షకు సన్నద్ధమవుతున్నాను. కానీ ఈ రెండు పరీక్షలు ఒకే రోజున ఉన్నాయి. రెండింటికీ కష్టపడి చదివాను. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏ పరీక్షను వదులుకోవాలో అర్థం కావడం లేదు.
– జె.తేజస్విని, డీఏఓ, పీఆర్‌టీ అభ్యర్థి

ఒక అవకాశం దెబ్బతిన్నట్టే..
దాదాపు ఆర్నెళ్లుగా డీఏఓ, పీఆర్‌టీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. ఇందుకోసం అశోక్‌నగర్‌లో ప్రత్యేకంగా ఫీజు చెల్లించి కోచింగ్‌ తీసుకుంటున్నాను. కానీ ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో నేను ఒక అవకాశాన్ని వదులుకోవాలి. నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంవల్ల అభ్యర్థుల అవకాశాలు దెబ్బతినడంఎంతవరకు సమంజసం.    
–పరిమళ, డీఏఓ, పీఆర్‌టీ అభ్యర్థి

టీఎస్‌పీఎస్సీ పరీక్ష తేదీలను మార్పు చేయాలి
కేంద్ర నియామక సంస్థలు పరీక్షలు నిర్వహించే రోజున రాష్ట్ర స్థాయి నియామక సంస్థలు ఆయా ఉద్యోగాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దు. ఒక వేళ ఒకే రోజు కేంద్ర, రాష్ట్ర స్థాయి పరీక్షలు ఉంటే టీఎస్‌పీఎస్సీ తేదీల్లో మార్పులు చేయాలి. 14 సంవత్సరాల తర్వాత డీఏఓ ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఇలాంటి అవకాశాలను అభ్యర్థులు నష్టపోకుండా టీఎస్‌పీఎస్సీ తక్షణ చర్యలు చేపట్టాలి. లేకుంటే అభ్యర్థులతో కలసి ఆందోళన చేస్తాం.     
–ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top