
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత నిరసనల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం, తోపులాట ాకారణంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం, పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. సిరిసిల్లలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు చేసిన లాఠీచార్జీ చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జంగం చక్రపాణితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏక పక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను తంగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.