సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి
కరీంనగర్‌టౌన్/కరీంనగర్‌స్పోర్ట్స్: సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. నగరంలోని భగత్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అన్నివర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ వసతి గృహాన్ని సందర్శించారు. పలు సౌకర్యాలు పరిశీలించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడాపోటీల్లో రాణించాలి
కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పోటీల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రాంతీయ క్రీడా పాఠశాలను బుధవారం సందర్శించారు. జిమ్నాస్టిక్స్ సాధన, పాఠశాలలో వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. స్పోర్ట్స్‌స్కూల్‌లో యోగా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలు సమకూర్చామని, వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనను తిలకించి అభినందించారు. డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


