కోర్టులో ‘సెస్‌’ భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

కోర్టులో ‘సెస్‌’ భవితవ్యం

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

‘సెస్‌’ సంస్థ స్వరూపం

సిరిసిల్ల: సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) భవితవ్యం ‘కోర్టు’కు చేరింది. ‘సెస్‌’ సంస్థకు వినియోగదారులు ఎన్నుకున్న పాలకవర్గం ఉండగానే లైసెన్స్‌ను పునరుద్ధరించకుండా విద్యుత్‌ పంపిణీ నిర్వహణ బాధ్యతలను ఎన్పీడీసీఎల్‌కు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన గ్రామసభల్లో ఈ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక గ్రామ సభల్లో, మున్సిపాలిటీల్లోని వార్డు సభల్లో ‘సెస్‌’ సంస్థను కొనసాగించాలని పలువురు వినతిపత్రాలు అందించారు.

దేశంలోనే తొలి పైలట్‌ ప్రాజెక్టు

దేశంలోనే తొలిసారి కేంద్ర గ్రామీణ విద్యుద్ధీకరణసంస్థ(ఆర్‌ఈసీ) పైలట్‌ ప్రాజెక్టుగా 1970లో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)ను సిరిసిల్లలో స్థాపించింది. ఈ సంస్థ స్ఫూర్తితో దేశంలో హుకేరి(కర్ణాటక), కొడినోర్‌(గుజరాత్‌), లక్నో(ఉత్తరప్రదేశ్‌), ములప్రవరా(మహారాష్ట్ర)లో సహకార విద్యుత్‌ సరఫరా సంఘాలను ఎన్‌ఆర్‌ఈసీ ప్రారంభించింది. 56 ఏళ్లుగా సహకార రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ‘సెస్‌’ సంస్థ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయలేదు. దీంతో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త సర్కిల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

‘సెస్‌’ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి

‘సెస్‌’ చీకట్లో మగ్గిన పల్లెలకు విద్యుత్‌ వెలుగులనిచ్చింది. బీడు భూములను తడిపేందుకు కరెంట్‌ లైన్‌ను, స్తంభాలను అందించింది. గుడ్డి దీపాల ఇళ్లలో బల్బు అయి వెలిగింది. కాళ్లు, చేతులు ఆడిస్తూ నడిపే చేనేత మగ్గాలకు కరెంట్‌ మోటారై పవర్‌లూమ్‌ అయింది. ఒకప్పుటి సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకాల పరిధిలో ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది. దేశంలోనే సహకార రంగంలో విద్యుత్‌ను పంపిణీ చేసే ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది. అనేక దేశాల విద్యుత్‌రంగ నిపుణులు సిరిసిల్ల సెస్‌పై అధ్యయనం చేశారు.

సిరిసిల్ల ‘సెస్‌’ ప్రత్యేకత ఏమిటీ?

ఎన్పీడీసీఎల్‌ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తూ ‘సెస్‌’ పరిధిలో కాస్త ఎక్కువ రేటుకు పంపిణీ చేస్తుంది. ఇలా వచ్చే ఆదాయంతో సంస్థ సమర్థంగా నడుస్తోంది. వ్యవసాయాభివృద్ధి, వస్త్రోత్పత్తి రంగ అభివృద్ధికి సెస్‌ సంస్థ బాటలు వేసింది. వినియోగదారులు అడిగిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే 24 గంటల్లో రిపేరు చేసి ఇవ్వడం సంస్థ ప్రత్యేకత.

కోర్టును ఆశ్రయించనున్న పాలకవర్గం

తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ‘సెస్‌’ లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయకుండా నిర్వహణ బాధ్యతలను ఎన్పీడీసీఎల్‌కు అప్పగించడంపై సంస్థ పాలకవర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈమేరకు హైకోర్టులో కేసు వేస్తూ న్యాయపోరాటం చేయాలని, మరోవైపు ట్రిబ్యునల్‌లోనూ కేసు వేయాలని పాలకవర్గం సభ్యులు భావిస్తున్నట్లు తెలిసింది. 4వ తేదీన జరగాల్సిన ‘సెస్‌’ సర్వసభ్యసమావేశాన్ని వాయిదా వేశారు. మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ‘సెస్‌’ సంస్థ అంశం గురువారం చర్చనీయాంశమైంది.

56 ఏళ్లలో తొలిసారి ఎన్పీడీసీఎల్‌ నిర్వహణ షురూ

కోర్టుకెళ్లిన ‘సెస్‌’ పాలకవర్గం

స్థాపితం: 1970 నవంబరు 1

గ్రామాలు: 260

ఉద్యోగులు : 355

సబ్‌స్టేషన్లు : 78

ట్రాన్స్‌ఫార్మర్లు : 10,932

వ్యవసాయ కనెక్షన్లు : 80,289

మరమగ్గాల కనెక్షన్లు : 8,265

గృహవిద్యుత్‌ కనెక్షన్లు : 1,79,928

పరిశ్రమలు: 3,542

దుకాణాలు : 15,122

ఇతర అన్ని కనెక్షన్లు : 18,648

విద్యుత్‌ లైన్లు : 15,918 కిలోమీటర్లు

నెలకు వసూలయ్యే విద్యుత్‌ బిల్లులు:

రూ.14 కోట్లు

ప్రతీ నెల విద్యుత్‌ కొనుగోలు ఖర్చు :

రూ.45 కోట్లు

ప్రభుత్వం చెల్లించే రాయితీలు :

రూ.30.50 కోట్లు

నెలవారీగా సిబ్బంది జీతాలు : రూ.4 కోట్లు

సంస్థ ఆస్తులు : రూ.125 కోట్లు

ప్రభుత్వ బకాయిలు: రూ.1,100

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement