సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జూలై మొదటి వారం వరకు వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేటి నుంచి జూలై 2 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ప్రస్తుతం సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ పరిస్థితి మరో రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకూ వర్షాలు విస్తరించనున్నాయి. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగామ, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మరికొద్ది గంటల్లో వర్షాలు ప్రారంభమై మధ్యాహ్నం తర్వాత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుంచే చినుకులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముండటంతో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రానున్న ఏడు రోజుల పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలు వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


