రామగిరి(నల్లగొండ) : రాజకీయాల్లో చిన్న పదవి ఉన్నా జీవితం ఉన్నతంగా ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ నల్లగొండ మండలం అన్నపురెడ్డిగూడెం సర్పంచ్ తీగల యాదయ్య మాత్రం కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుకుంటున్నాడు. పేద కుటుంబానికి చెందిన యాదయ్య గతంలో హైదరాబాద్‌లో డీసీఎం డ్రైవర్‌గా పనిచేశాడు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో గ్రామస్తుల ఆదరణతో అన్నపురెడ్డిగూడెం సర్పంచ్‌గా గెలుపొందాడు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె డిగ్రీ ఫస్టియర్, కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. అర ఎకరం భూమి ఉంది. సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామంలోనే ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నాడు.
ఈ క్రమంలో వ్యక్తిగత ఆదాయం లేకుండా పోయింది. పెరిగిన ఖర్చులు, కుటుంబ బాధ్యతలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేయడంతో రూ.లక్ష అప్పు చేశాడు. ఇంట్లో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో తాను సర్పంచ్ అయినా కష్టపడి పనిచేయాలని యాదయ్య నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రెండు నెలల క్రితం పాత ఆటో కొనుగోలు చేశాడు. నల్లగొండ పట్టణంలో ప్రయాణికులను తీసుకెళ్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకవైపు సర్పంచ్‌గా సేవ చేసూ్తనే మరోవైపు సామాన్యుడిలా కష్టపడుతున్న తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
కష్టపడి పనిచేయడంలో తప్పులేదు
ఏ పని చిన్నది కాదు. నా కుటుంబం కోసం కష్టపడి పనిచేయడం నాకు గర్వంగా ఉంది. సర్పంచ్‌గా ఎన్నికైనందున ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. కానీ నా కుటుంబ బాధ్యతలు కూడా నేను చూసుకోవాలి. ఎవరినీ మోసం చేయకుండా నా శ్రమతోనే డబ్బు సంపాదిస్తున్నాను.
– తీగల యాదయ్య, సర్పంచ్


