ఆ ఐదుగురినీ విడుదల చేయండి

Telangana Minister Requests UAE To Release 5 NRIs Lodged In Dubai Prison - Sakshi

దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్లకు చెందిన ఐదుగురు 

వారి విడుదల కోసం యూఏఈ రాయబారి అబ్దుల్‌ నసీర్‌ అల్శాలికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి 

కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో అల్శాలి భేటీ 

తెలంగాణలోని అభివృద్ధి పట్ల ప్రశంసలు 

సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్‌: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి అబ్దుల్‌ నసీర్‌ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్‌ నసీర్‌ సోమవారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్‌ అందజేశారు.

నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్‌ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్‌ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు.

బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్‌ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిందని, ఇక దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తుమ్‌ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. 

హైదరాబాద్‌ భేష్‌: యూఏఈ రాయబారి ప్రశంసలు 
కేటీఆర్‌తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్‌ నసీర్‌ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్‌ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు.

ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని స్టార్టప్‌ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్‌ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్‌ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్‌ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్‌ క్యాపిటలిస్టులను, హైదరాబాద్‌ ఈకో సిస్టంలోని స్టార్టప్‌ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top