టీఆర్‌ఎస్‌ ఆగడాలు మితిమీరుతున్నాయి: భట్టి

Telangana: Mallu Bhatti Vikramarka Slams On TRS Party - Sakshi

మధిర: రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆగడాలు మితిమీరుతున్నాయని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ఆదివారం 24వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మడుపల్లి మీదుగా దేశినేనిపాలెం చేరుకుంది.

అక్కడ జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. కామారెడ్డిలో తల్లీకొడుకుల సజీవ దహనం, ఖమ్మంలో యువకుడి ఆత్మహత్యకు కారణమైన నేతలపై, వేధింపులకు పాల్పడిన పోలీసులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలీసులు, టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకులకు ఫ్రెండ్లీగా ఉంటున్నారని, అది ప్రజల ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఎలా అవుతుందని భట్టి ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ నాయకుల వేధింపుల వల్లే సామినేని సాయిగణేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మెదక్‌ జిల్లా రామాయంపేట గ్రామానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గంగం సంతోష్, ఆయన తల్లి పద్మ పెట్రోల్‌ పోసుకుని సజీవ దహనం చేసుకోవడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అరాచకాలకు అడ్డే లేదని అర్థమవుతోందన్నారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్పడుతున్న అరాచకాలను అరికట్టాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top