దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి | Telangana is the leader in rice production in the country | Sakshi
Sakshi News home page

దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామి

Apr 16 2025 12:18 AM | Updated on Apr 16 2025 12:18 AM

Telangana is the leader in rice production in the country

ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి ద్వారా మిగులు ధాన్యానికి పరిష్కారం: మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌/ఏజీవర్సిటీ: దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో ఈ ఏడాది తెలంగాణ అగ్రగామిగా నిలి­చిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమా­ర్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రా­ష్ట్రంలో సుమారు 280 లక్షల మెట్రిక్‌ టన్నుల ధా­న్యం ఉత్పత్తి అయిందని, ఇది ఒక రికార్డు అని చె­ప్పా­రు. తెలంగాణ నుంచి తొలిసారి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో మంగళ­వారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవ­సా­య విశ్వవిద్యాలయంలో ‘బియ్యం ఎగుమతి విధా­నం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఉత్తమ్‌­కుమార్‌ మాట్లాడారు. 

రాష్ట్ర అవసరాలు, ఎఫ్‌సీఐ సెంట్రల్‌ పూల్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ తదితరాలకు పోగా ఏటా 50 నుంచి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిగులు ఉంటుందన్నారు. మిగులు ధాన్యం మా­ర్కెట్‌ చేయడానికి ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందంలో భా­గంగా ఏడాదికి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నా­రు. 

ఇటీవల వరి సాగు విధానంలో కూడా మార్పు వచ్చిందని, దాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరి నేరుగా విత్తే పద్ధతి (డీఎస్‌ఆర్‌), రోజు విడిచి రోజు నీరు పెట్టే విధానం (ఏడబ్ల్యూడీ), తక్కువ రసాయనాలు కలిగిన వరి రకాలను ఉత్పత్తి చేయడంపై రైతులను ప్రోత్సహించా­లని శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. ఎగు­మ­తికి అనుకూలమైన రకాలను ఉత్పత్తి చేసే రైతుల­కు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్న­ట్లు ప్రకటించారు. 

ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ ఫిలిప్పీన్స్‌ దేశం ఎప్పటికీ దిగుమతి చేసుకునే దేశమేనని, ఆ దేశాన్ని తెలంగా­ణ బియ్యానికి అనుకూలమైన మార్కెట్‌గా గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తద్వారా తెలంగాణలో పండుతున్న బియ్యం నిల్వలకు శాశ్వ­త పరిష్కారం దొరికినట్లవుతుందని చెప్పారు. కా­ర్య­క్రమంలో అఖిలభారత రైస్‌ మిల్లర్ల అసోసియే­షన్‌ అధ్యక్షుడు బి.కృష్ణారావు, విశ్వవిద్యాలయ పరి­శోధన సంచాలకుడు డాక్టర్‌ బలరాం, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ దామోదర్‌ రాజు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement