ఆహ్వానితులకే టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రవేశం

Telangana: KTR Inspects Arrangements At Hitex For Plenary - Sakshi

ప్రతినిధులకు గుర్తింపు కార్డులు 

పలు కమిటీల ఏర్పాటు 

గ్రేటర్‌ పరిధిలో అలంకరణ బాధ్యత ఎమ్మెల్యేలకు 

25న హెచ్‌ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్లీనరీకి ఆహ్వానాలు ఉన్న నాయకులనే అనుమతించనున్నారు. ఈ మేరకు ముఖ్యనేతలకు అధిష్టానం స్పష్టంచేసింది. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) ప్రాంగణంలో ప్లీనరీని నిర్వహించనున్న విషయం తెలిసిందే. అధికారులు, పోలీసులు, ముఖ్యమైన పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. సభ జరిగే చోట చేపట్టాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకునే మార్గం, ట్రాఫిక్, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు కేటీఆర్‌ పలు సూచనలు చేశారు.

ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే పార్టీ నేతలు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సమావేశం సజావుగా సాగేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి 14 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నందున అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. గందరగోళానికి తావు లేకుండా ప్లీనరీ సమావేశానికి ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రమే హాజరయ్యేలా చూడాలని జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, సమావేశాల సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ పతాకాలు, అలంకరణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ పరిధిలోని శాసనసభ్యులకు అప్పగించారు.

సభ నిర్వహణ ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు పార్టీ తరఫున పలు కమిటీలు వేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆహ్వానాలు, సభావేదిక అలంకరణ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్, ప్రతినిధుల భోజన ఏర్పాట్లు, తీర్మానాలు, మీడియా బాధ్యతలు చూసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలకు కమిటీల్లో భాగస్వామ్యం కల్పించారు.  

దేశానికే ఆదర్శం తెలంగాణ: కేటీఆర్‌ 
ప్లీనరీ ఏర్పాట్లపై హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభిన్న పాలసీలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రైతుబంధు స్ఫూర్తితో ‘పీఎం కిసాన్‌ నిధి’, మిషన్‌ భగీరథ తరహాలో ‘జలజీవన్‌ మిషన్‌’వంటి కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌.. తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త విధానం ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోందన్నారు. గతంలో ‘నేడు బెంగాల్‌ చేసే పనిని.. రేపు దేశం అనుసరిస్తుంది’అని చెప్పుకునేవారని, కానీ ప్రస్తుతం ‘నేడు తెలంగాణ చేసేది.. రేపు భారత్‌ అనుసరిస్తుంది’అన్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

ప్లీనరీ నిర్వహణ కమిటీలు ఇవే! 
ఆహ్వాన కమిటీ: మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.  
సభాస్థలి అలంకరణ: ఎమ్మెల్యే గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌. 
ప్రతినిధుల నమోదు: ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు.  
పార్కింగ్‌: ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌.  
ప్రతినిధుల భోజనం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.  
తీర్మానాల కమిటీ: పార్టీ నేతలు మధుసూదనాచారి, పర్యాద కృష్ణమూర్తి 
మీడియా కమిటీ: ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top