
రైతులకు ఎవరు మంచి చేశారో చర్చకు సిద్ధం
మా పార్టీ తరఫున రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా
చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల టైమ్ ఇస్తున్నా
లేదంటే 8న ప్రెస్‌క్లబ్‌లో 11 గంటలకు రెఢీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రైతులకు ఎవరు మంచి చేశారో చర్చిద్దాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రొటీన్‌గా రంకెలు వేస్తూ చాలెంజ్‌లు చేస్తున్నారు. ఆయన ముచ్చట తీర్చేందుకు బీఆర్‌ఎస్ తరఫున నేను సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి లేదా అయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో చర్చకు సిద్ధం. లేదంటే మా నాయకుడు కేసీఆర్ సొంతూరు చింతమడక, ఆయన నియోజకవర్గం గజ్వేల్ అయినా సరే. అసెంబ్లీలో పెడతావో, అంబేడ్కర్ విగ్రహం దగ్గర పెడతావో చర్చ నీ ఇష్టం. వేదిక, తేదీ, సమయం అన్నీ సీఎం ఇష్టమున్నట్లుగా నిర్ణయించుకోవచ్చు. బేసిక్స్ కూడా తెలియని సీఎం.. చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు 72 గంటల గడువు ఇస్తున్నా.
లేదంటే ఈ నెల 8న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 గంటలకు మేమే వేదిక ఏర్పాటు చేసి సీఎం కోసం కుర్చీ వేసి ఎదురుచూస్తాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సవాలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ మినహా ఎవరూ సంతోషంగా లేరు. దండుపాళ్యం ముఠా రీతిలో బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరించి దోచుకుంటూ హామీలు అమలు చేయడం లేదు. రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను ఏటీఎంగా మార్చి రేవంత్.. ‘పే సీఎం’లా తయారయ్యారు. చంద్రబాబు కోవర్టులా మారిన రేవంత్ ఇక్కడి నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారు’అని మండిపడ్డారు.
నిధులు ఢిల్లీకి.. నీళ్లు ఆంధ్రకు
‘తెలంగాణలో రైతు రాజ్యాన్ని తెచ్చి, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దింది ఎవరో ప్రజలకు తెలుసు. అన్నీ తెలిసీ నిజం ఒప్పుకోకుండా నటించడం రేవంత్‌కు మాత్రమే తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదం స్ఫూర్తిని దెబ్బతీస్తూ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీ కాంగ్రెస్‌కు మళ్లిస్తూ.. కొందరు తొత్తులను రేవంత్ పదవుల్లో నియమించుకున్నారు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు ఊడదీసి కొట్టాలి అంటున్న రేవంత్‌కు కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో చెప్పులతో నిలబడటమే ఇందిరమ్మ రాజ్యం అని తెలియదా. ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని అన్యాయంగా జైల్లో పెట్టిన ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడితే నికృష్టంగా ఉంది.
మాకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని చెప్పి.. నిజంగానే ఆ పాత దుర్ధినాలను రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ఎరువులను పంచడం కూడా చేతగాని సీఎం రేవంత్, చర్చకు కేసీఆర్ రావాలని సవాలు చేయడాన్ని చూసి జనం నవ్వుతున్నారు. నాలుగు పంటలకు గాను ఒక్క పంటకు ఒక్కసారి రైతుబంధు వేసి దానికి పండుగ చేసుకోమని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు. ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుంది. వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని రేవంత్ పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా ఈసారి ఓటేయదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు.