
తెలంగాణ బీజేపీ నేతలపై గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పోటీ లేదని.. బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తోందని, అలాంటి పార్టీని ఇక్కడి నేతలే నట్టేట ముంచుతున్నారని వ్యాఖ్యానించారాయన. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ రాజాసింగ్ ఓ వీడియో వీడియో విడుదల చేశారు.
ఎంత బాధలో ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు?. ఆయనతోనే కాదు.. గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?. నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టీ నన్ను ఇబ్బంది పెట్టారు. వారికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డికి ఏముంది?. తెలంగాణలో ఇక్కడున్న నేతలే బీజేపీని ముంచుతున్నారు. దీనిపై బిజెపి జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది.
.. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. బిజెపిలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా!. బిజెపి కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని రాజాసింగ్ ఆ వీడియోలో చెప్పారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నిరసనకు దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్‌ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్పటేల్ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని చర్చ నడిచింది.