సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ (Hayathnagar)లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్ (Premchand)పై నిన్న వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే, హయత్‌నగర్‌లో బాలుడిపై కుక్కల దాడి వార్తను పత్రికల్లో చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం, తక్షణ సాయం వెంటనే అందజేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించటంతో పాటు బాధిత కుటుంబాన్ని వెంటనే కలవాలని, వారి బాగోగులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. తాపీ పనులు చేసుకుంటూ హయత్ నగర్ శివగంగ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు ప్రేమ్ చంద్ (7) పుట్టుకతోనే మూగవాడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో తాగునీరు పడుతోంది. ఆ క్రమంలో ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వచ్చిన ప్రేమ్ చంద్‌పై దాదాపు 10 నుంచి 12 వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. స్థానికులు గమనించి కుక్కల్ని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో బాలుడి చెవి ఊడిపోగా, మెడ, చెవి, నడుము, పిక్కలతోపాటు శరీరమంతా తీవ్ర గాయాలతో రక్తసిక్తమైంది.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలు పెరిగిపోయి తాము బయటకు వెళ్లాలంటేనే ఎంతో భయపడుతున్నామని, ఈ విషయమై ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాలుడి వైద్యానికి సంబంధించిన ఖర్చులను జీహెచ్ఎంసీ భరించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇలాంటి సంఘటనలు తరుచుగా రిపీట్ అవుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


