
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్లే ఎరువుల కొరత
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు?
అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తే అయితే వ్యతిరేకించాల్సిందే
సెప్టెంబర్ 9లోపు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికే మద్దతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఎరువుల పరిమాణం, ఎంత పంపిణీ అయ్యిందీ, పక్కదారి పట్టిన ఎరువులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును వివరించాలని ఆదేశించారు. తాము వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, పార్టీ తరఫున పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నందినగర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతులు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు
‘కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ్ధ విధానాలతో రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేయడం ద్వారా రైతులకు సకాలంలో అందేలా చూశాం. కానీ ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతోనే ఎరువుల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత, సోషల్ మీడియా దుష్ప్రచారం అంటూ సీఎం కాలయాపన చేస్తున్నాడు. కానీ కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులే ఎరువులను బ్లాక్‌లో అమ్ముతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. దమ్ముంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎరువుల కొరతపై గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి..’ అని కేటీఆర్ సవాల్ చేశారు.
కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా
‘బీసీ సామాజికవర్గం మీద ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన వారిని ఎందుకు పోటీ చేయించడం లేదు?. కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా. ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తే అయితే కచ్చితంగా వ్యతిరేకించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అని కేటీఆర్ చెప్పారు.
‘మార్వాడీ గో బ్యాక్’పై ప్రభుత్వం స్పందించాలి
‘‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం స్పందించాలి. విశ్వనగరం హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వారు ఉన్నారు. పొట్ట కూటి కోసం వచ్చే వారితో తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. పొట్ట కొట్టే వారిపైనే పోరాటం. ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు ఇక్కడి వారి సంస్కృతి, మనోభావాలను గౌరవించాలి..’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మేము ఏ కూటమిలోనూ భాగస్వాములం కాదు
‘బీఆర్‌ఎస్ సర్వ స్వతంత్ర పార్టీ. మాకు ఢిల్లీలో బాస్ ఎవరూ లేరు. ఢిల్లీ పార్టీలేవి మాకు బాసులు కాదు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మేము ఎన్‌డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ భాగస్వాములం కాదు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇప్పటివరకు మమ్మల్ని ఏ కూటమీ సంప్రదించలేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తాం. సెప్టెంబర్ 9లోపు రాష్ట్ర రైతులకు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతాం..’ అని కేటీఆర్ తెలిపారు.