
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ జూబ్లీహిల్స్ పరిధి షేక్‌పేటలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే అవకాశం ఉపఎన్నిక, స్థానిక ఎన్నిక రూపంలో వచ్చింది. వీటిలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ప్రచారం చేసేది టూరిస్టు మంత్రులే. ఎన్నికలు అయిపోగానే మంత్రులు, సామంతులు అందరూ మాయమైపోతారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే అని స్పష్టం చేశారు.
‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమలతో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటారు. ఉన్న మెట్రోను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనం. కాంగ్రెస్‌కు ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
