
డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చొనే వారు ధరించడం తప్పనిసరి
ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు
యుద్ధప్రాతిపదికన బెల్టులు ఏర్పాటు చేస్తున్న డిపో మేనేజర్లు
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్‌తోపాటు పక్కన ఉండే సింగిల్ సీటుకు కూడా సీటు బెల్టును ఉన్నతాధికారులు తప్పనిసరి చేశారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డిపో మేనేజర్లు యుద్ధప్రాతిపదికన అన్ని బస్సుల్లో డ్రైవర్ సీటుకు, ముందుండే ప్రయాణికుల సీటుకు బెల్టులు బిగిస్తున్నారు.
కార్లకే అమలవుతున్న నిబంధన..
ఏదైనా వాహనం ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకొని ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలా ప్రమాదాల్లో సీటు బెల్టు ధరించని వారు మృతిచెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే కార్లు సహా ఇతర వాహనదారులు సీటు బెల్టు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
అయితే కారు డ్రైవర్ సీటు బెల్టు ధరించకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు.. ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు డ్రైవర్లు వేగంగా ముందుకు ఎగిరిపడి గాయపడటమో లేదా మరణిస్తుండటమో జరుగుతోంది.
ఆర్టీఐ దరఖాస్తుతో స్పందన..
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్టీసీ నుంచి సీటు బెల్టులకు సంబంధించిన వివరా లు కోరారు. బస్సుల్లో సీట్లకు బెల్టులున్నాయా? వాటిని డ్రైవర్లు ధరిస్తున్నారా? ఒకవేళ ధరించకుంటే ఎన్ని కేసులు నమోదయ్యాయి? జరిమానాలు చెల్లించారా? లాంటి వివరాలు కోరారు. ప్రస్తుతం కొత్త ఆర్టీసీ బస్సులకు బెల్టులుంటున్నా వాటిని డ్రైవర్లు వినియోగించనందున క్రమంగా అవి ఊడిపోతున్నాయి.
వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయట్లేదు. ఆర్టీఐ కింద వచ్చిన అర్జీకి అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉన్నందున నిబంధనలను పాటించట్లేదని ఆర్టీసీ అధికారికంగా ఒప్పుకున్నట్టవుతుంది. అందుకే వెంటనే అన్ని బస్సుల్లో సీటు బెల్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు డిపో మనేజర్లను ఆదేశించగా డిపో మేనేజర్లు ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు.
డ్రైవర్లు కచ్చితంగా సీటు బెల్టు ధరించాలని ‘గేట్ మీటింగ్’సమయంలో డిపో మనేజర్లు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ముందు సీట్లో కూర్చొనే వారు కూడా ధరించేలా చూడాలని సూచిస్తున్నారు. కాగా, కొత్త బస్సుల్లో చిట్టచివరి సీట్ల వరుసలోని మధ్య భాగం సీట్ల (దారి ఎదురుగా ఉండే సీట్లు)కు కూడా బెల్టులు ఉన్నా ఆ విషయం ప్రయాణికులకు తెలియట్లేదు.