స్థానిక ఎన్నికలపై డైలమా! | Congress Party Focus On Local Body Elections in Telangana | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలపై డైలమా!

Aug 27 2025 1:35 AM | Updated on Aug 27 2025 1:35 AM

Congress Party Focus On Local Body Elections in Telangana

వాయిదా వేద్దామా లేక బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి 

ముందుకెళ్దామా అన్న దానిపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

వాయిదా వేయాలనుకుంటే ఆర్డినెన్స్‌ను మళ్లీ పంపాలని సలహా ఇచ్చిన న్యాయ నిపుణులు 

ఎన్నికల నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు! 

హైకోర్టు గడువు ముంచుకొస్తున్నా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి 

పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళితే బూమరాంగ్‌ అవుతుందనే ఆందోళన 

42% రిజర్వేషన్లతో జీవో ఇవ్వడమే ప్రత్యామ్నాయమనే ప్రతిపాదన తెరపైకి 

న్యాయ నిపుణులు, ప్రభుత్వం, పార్టీ ఆలోచనలను క్రోడీకరించి నివేదిక ఇవ్వనున్న మంత్రుల బృందం  

30న కేబినెట్‌ భేటీ తర్వాతే స్పష్టత

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ:  రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా? ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళదామా అన్న దానిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. మంత్రుల బృందం చేసే సిఫారసును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ, కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

ఎటూతేల్చుకోలేక..!: పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా  పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. 

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఈ తర్జనభర్జనల నేపథ్యంలోనే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది.  

పార్టీ పరంగా ఇస్తే బూమరాంగ్‌ ఖాయం 
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే బూమరాంగ్‌ కావడం ఖాయమని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చిచెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. 

అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన రెండు బిల్లులతో పాటు, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని తప్పుపడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది. 

సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీలతో చర్చలు జరిపిన సీఎం, మంత్రుల బృందం.. మంగళవారం బిహార్‌లో ఓటర్‌ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌గాందీతోనూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. 

బీజేపీని ఎండగట్టాల్సిందే.. 
‘పార్గీ పరంగా సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే రావొచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించొచ్చు. ఇది బీసీలను మోసం చేయడమే..’ అని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ‘బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక్క తెలంగాణ అంశమే కాదు.. యావత్‌ దేశానిది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఒకట్రెండు ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. 

కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని హైకమాండ్‌ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా? అనే సందేహం కూడా కాంగ్రెస్‌ నేతలను వెంటాడుతోంది. 

కోర్టును గడువు అడగండి..మళ్లీ ఆర్డినెన్స్‌ పంపండి 
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్‌లో రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. 

తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలిసింది. 

అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్‌ చేసి, మరోమారు ఆమోదం కోసం గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో ఆరు వారాల గడువు కోరుతూ కౌంటర్‌ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  
అసెంబ్లీ సమావేశాల నిర్ణయంపై చర్చ 
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ నిర్వహణకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం సాధ్యం కాదనే కోణంలోనే వీలున్నంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. 

ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్‌ నిర్ణయం ఉంటుందని సమాచారం ఏది ఏమైనా ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో..అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  

రాహుల్‌ యాత్రలో సీఎం, రాష్ట్ర నేతలు 
కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ బిహార్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్‌షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంకగాం«దీని కూడా రాష్ట్ర నేతలు కలిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement