‘సంధ్యా’ కూల్చివేతలకు కారణాలేమిటో చెప్పండి | Telangana High Court Serious On Hydra Demolitions | Sakshi
Sakshi News home page

‘సంధ్యా’ కూల్చివేతలకు కారణాలేమిటో చెప్పండి

Nov 19 2025 11:24 AM | Updated on Nov 19 2025 11:35 AM

Telangana High Court Serious On Hydra Demolitions

 హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు స్పష్టంగా చెప్పి.. హెచ్చరించాం  

అయినా నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలా? 

ప్లాట్ల యజమానుల హక్కులు ఎలా కాపాడాలో కోర్టుకు తెలుసు 

వివరాలు తమ ముందు ఉంచాలని ఏఏజీని ఆదేశించిన జడ్జి  

తదుపరి విచారణ రేపటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నంబర్‌ 124, 125లలో సంధ్యా కన్వెన్షన్‌కు చెందిన నిర్మాణాలకూల్చివేతకు కారణాలు తెలియజేయాలని హైడ్రా, జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. రంగానాథ్‌ ఈ కోర్టుకు హాజరైనప్పుడు కూల్చివేతలపై అనుసరించాల్సిన పద్ధతిని స్పష్టం చెప్పామని పేర్కొంది. చట్టపరమైన విధానాన్ని పాటించాలని పదే పదే చెబుతూ.. దాన్ని ఉల్లంఘించవద్దని హెచ్చరించామంది. అయినా.. నోటీసులు జారీ చేయకుండా.. అదే తీరుతో వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. మళ్లీ కోర్టుకు పిలిచే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పినా తీరు మార్చుకోకపోతే కఠిన వ్యవవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అసలు హైడ్రాకు ఉన్న అధికారాలేంటో ఒక్క పిటిషన్‌లో కూడా కౌంటర్‌ వేయలేదని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ను అడిగింది. రహదారుల వివాదంలో జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించింది. సంధ్యా కన్వెన్షన్‌కు చెందిన నిర్మాణాల కూల్చివేత వివరాలు తమ ముందు ఉంచాలని చెబుతూ తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.  

హైకోర్టును ఆశ్రయించిన ‘సంధ్యా కన్వెన్షన్‌’ 
నోటీసులు జారీ చేయకుండా తమ ప్రైవేట్‌ ప్లాట్లలోకి బలవంతంగా ప్రవేశించి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని సంధ్యా హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జూన్‌లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. భవన నిర్మాణ అనుమతులకు అనుగుణంగా పిటిషనర్లు చేసే నిర్మాణాల్లో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైడ్రా సంధ్యా కన్వెన్షన్‌కు సంబంధించిన నిర్మాణాలను కూలి్చవేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ హైడ్రా కమిషనర్‌పై సంధ్యా హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌తోపాటు ఇలాంటి మరికొన్ని పిటిషన్లపై జస్టిస్‌ బీ.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. 

వందల సంఖ్యలో పిటిషన్లు..  
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు, ఎంఎస్‌ మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మున్సిపల్‌ అధికారులు అనుమతి మంజూరు చేశారు. హైడ్రా ఎన్‌వోసీ జారీ చేసింది. అయినా సోమవారం ఉదయం నాలుగు గంటలకే కూల్చివేతలు చేపట్టారు. నోటీసులు కూడా జారీ చేయలేదు. మధ్యంతర ఉత్తర్వులున్నా చట్టవిరుద్ధంగా హైడ్రా నిర్మాణాలను కూలి్చవేసింది. ఎక్కడైనా ఉల్లంఘనలుంటే వాటిని కూల్చవచ్చు. కానీ, భవనాన్నంతా నేలమట్టం చేశారు. పిటిషనర్‌కు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. హైడ్రా నోటీసులు జారీ చేసి, ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.  

హైడ్రా తరఫున ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. తనకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పారు. సంధ్యా కన్వెన్షన్‌పై ఫిర్యాదుదారు చేసిన వ్యక్తి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపించారు. తమ కేవియట్‌ను పరిగణనలోకి తీసుకుని కాపీలు అందజేసేలా ఆదేశించాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కూల్చివేతల పిటిషన్లే వందల సంఖ్యలో వస్తున్నాయని, దీనికి తార్కిక చట్టపరమైన ముగింపు అవసరమన్నారు. హైడ్రా ఇలానే వ్యవహరిస్తే.. ప్లాట్ల యజమానుల హక్కులు ఎలా కాపాడాలో కోర్టుకు తెలుసన్నారు. సంధ్యా అధీనంలో ఎన్ని ప్లాట్లు ఉన్నయ్‌.. సేల్‌డీడ్‌ కాపీలు, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ ఉంటే వివరాలు అందజేయాలని పిటిషనర్‌ న్యాయవాది ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement