ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి! | Telangana High Court questions Govt over non-payment of fee reimbursement to colleges | Sakshi
Sakshi News home page

ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి!

Jun 25 2026 12:57 AM | Updated on Jun 25 2026 12:57 AM

Telangana High Court questions Govt over non-payment of fee reimbursement to colleges

ఫీజు బకాయిలపై సర్కార్‌కు మరోసారి హైకోర్టు ఆదేశం  

మీరు చెల్లించరు.. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వరు

ఫీజులు చెల్లించకుండా అడ్మిషన్‌ సాధ్యమేనా?

బకాయిల చెల్లింపుపై వారాలకు వారాలు గడువు ఇవ్వలేం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఫీజు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు ఎలా నడుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించకుండా.. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవద్దంటే ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్‌ ఎలా ఇస్తారని నిలదీసింది. విచారణకు సమయం లేకపోవడంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

బకాయిల చెల్లింపు తేదీతో రావాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 29న జారీ చేసిన జీవో 7లోని ఓ క్లాజ్‌ను సవాల్‌ చేస్తూ పలు ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ క్లాజ్‌ విరుద్ధమన్నాయి. దీని ప్రకారం ప్రవేశ సమయంలో ట్యూషన్‌ ఫీజు సహా ఇతర ఫీజుల కోసం విద్యార్థులను కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదు. కాలేజీల పిటిషన్‌పై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.  

తాజా జీవోనూ సస్పెండ్‌ చేయాలి.. 
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎల్‌.రవిచందర్, శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే విధించిన జీవో 7ను ఉపసంహరిస్తూ జీవో 8ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై మార్గదర్శకాలతో జీవో 9ని విడుదల చేసిందని చెప్పారు. ఇందులోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామని చెప్పిందన్నారు.

ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని విద్యార్థులు తప్పనిసరిగా వారంలోపు కాలేజీలకు చెల్లించాలని, అలా చెల్లించని విద్యార్థుల తల్లిదండ్రులపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేస్తామని పేర్కొందన్నారు. ఈ జీవో కూడా గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమని.. సస్పెండ్‌ చేయాలని కోరారు. ఫీజు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం వెంటనే చెప్పాలని.. లేనిపక్షంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.  

కేంద్రం వాటా రావాలి: జీపీ 
ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కేంద్రం వాటా కూడా ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్రమే రీయింబర్స్‌మెంట్‌ నిధులు చెల్లిస్తోందన్నారు. అయితే.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కేంద్రం చెబుతోందని, ఆ తర్వాత తమ వాటా విడుదల చేస్తామంటోదన్నారు. దీంతో ఇప్పుడు మొత్తం బకాయిలను రాష్ట్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. బకాయిలు రూ.వేల కోట్లు ఉన్నందున కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు రెండు వారాలు గడువు కావాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అంత సమయం ఇవ్వలేమని, గురువారం(నేడు)లోగా బకాయిల విడుదలపై స్పష్టత ఇవ్వాలంటూ విచారణ వాయిదా వేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement