తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త | Telangana Govt Increase RTC Employees DA | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

Apr 10 2026 11:14 AM | Updated on Apr 10 2026 11:52 AM

Telangana Govt Increase RTC Employees DA

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏ(Dearness Allowance)ను 2.1 శాతం పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది. పెరిగిన అలవెన్స్‌ ఈ ఏడాది జనవరి నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.

ఇంతకు ముందు 50.7% డీఏ ఉండగా.. తాజా పెంపుతో అది 52.8 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెలా రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. కిందటి ఏడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన సంగతి తెలిసిందే.

డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్‌ పనులు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశించారు.  

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 

ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యమే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏను ప్రకటించడం సంతోషమని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారాయన.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement