ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'! | Telangana Government takes key decision on crop purchases | Sakshi
Sakshi News home page

ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!

Jun 19 2026 4:13 AM | Updated on Jun 19 2026 4:13 AM

Telangana Government takes key decision on crop purchases

డిజిటల్‌ కేబినెట్‌ భేటీలో ట్యాబ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క తదితరులు

పంటల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది 

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం 

కేబినెట్‌ భేటీ తర్వాత మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క వెల్లడి 

ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్‌ 

30న మధిరలో రైతు సమ్మేళనం సభ.. రైతుభరోసా విడుదల 

ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతోంది.. తొందరపడి విత్తనాలు వేయొద్దు 

21న నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం 

ఇకపై పేపర్‌లెస్‌ డిజిటల్‌ మంత్రివర్గ సమావేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎఫ్‌సీఐ, సీసీఐ, నాఫెడ్‌ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్‌పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.  

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. 
ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 

83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. 
సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్‌ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048,హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం–1638, డబ్ల్యూజీఎల్‌–44, కేఎన్‌ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్‌ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్‌ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు.  

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు 
గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్‌ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ  ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.  

యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. 
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్‌ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్‌ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్‌కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 

మెట్రో–2కు సహకరించాలి.. 
‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్‌ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్‌ పరీక్షకు  2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్‌ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.  

వీబీజీ రామ్‌ జీ వద్దు..పాత నరేగా కావాలి  
పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్‌ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు.  

ఇక డిజిటల్‌ కేబినెట్‌ భేటీలు.. 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్‌ లెస్‌గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్‌ కేబినెట్‌ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్‌ ట్యాబ్‌లు అందజేశారు. ఇకపై ఈ– బుక్‌ ద్వారానే కేబినెట్‌ సమావేశం ఎజెండా, నోట్స్‌ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement