సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. తమ పార్టీ సింబల్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వాళ్లపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్‌ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత విచారణలో మూడు నెలల్లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..
ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారు. విచారణ జరిపి వాళ్ల నుంచి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పది మందిలో ఏడుగురిపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. టెక్నికల్లీ వాళ్లు పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని తేల్చేశారు. ఇంక మిగిలిన ముగ్గురి భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వివరణ ఆల్రెడీ ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలైతే ఇంకా స్పీకర్ ఎదుట హాజరై కనీస వివరణ కూడా ఇచ్చుకోలేదు. తమకు గడువు ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా స్పీకర్ ఇప్పటిదాకా ఎలాంటి బదులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ తరుణంలో..
శీతాకాల విడిది తర్వాత ఇవాళ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం పిటిషన్‌ను విచారణ జరపనుంది. ఫిరాయింపుల పిటిషన్లు కొట్టేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ తరఫు లాయర్లు ఇవాళ్టి విచారణ సందర్భంగా వాదించే అవకాశం ఉంది.


