
తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/తిరుమలగిరి (తుంగతుర్తి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లాకు రానున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ నిర్వహించనున్నారు. సభలో ఆయన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 5,61,343 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. వాటిద్వారా 45,34,430 మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో గతంలో 89,95,282 కార్డుల ద్వారా 2,81,47,565 మందికి లబ్ధి చేకూరగా, ఇకపై 95,56,625 రేషన్ కార్డుల ద్వారా 3,09,30,911 మందికి లబ్ధి చేకూరనుంది. సీఎం వెంట జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభలో పాల్గొననున్నారు.