
క్యాసినో కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురయ్యారు.
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని ఈడీ అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
తీవ్ర అస్వస్థతలకు గురైన ఎమ్మెల్సీ రమణను హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు ఈడీ అధికారులు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
చికోటీ ప్రవీణ్ సారథ్యంలో విదేశాల్లో అక్రమ క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తవ్వేకొద్దీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందితో కూడిన ఓ జాబితా లిస్ట్‌ను రూపొందించింది ఈడీ.
శుక్రవారం ఎమ్మెల్సీ రమణను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. దీంతో హైదరాబాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు ఆయన. అయితే విచారణ సమయంలో రమణ అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ ఇద్దరు సోదరులను ఇదివరకే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.