1. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం జరిగిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించింది. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ శాఖ అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపాలని నిర్ణయించారు. మృతుల అంత్యక్రియలు స్థానిక మత సంప్రదాయాల ప్రకారం అక్కడే నిర్వహించేందుకు, ఒక్కో కుటుంబానికి ఇద్దరిని పంపేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది.
2. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణించడంతో ఆయన కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావితరాలకు తెలియజేసేలా రాష్ట్రంలో అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ రచించిన "జయ జయ హే తెలంగాణ" గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు
3. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం.. భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ ఫారం బేస్డ్ వర్కర్స్ ఉన్నారు.
మొబిలిటీ, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్.. ఇతర రంగాల్లో గిగ్ వర్కర్లు.. ఇళ్లలో పని వాళ్ళు, తెలంగాణలో సుమారు 4 లక్షల మంది పని చేస్తున్నారు.
వీరికి ఎటువంటి సెలవులు లేకపోగా రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయాల్సి వస్తోంది.
ఈ గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత.. బీమా సౌకర్యం, చెల్లింపుల విషయంలో స్పష్టమైన విధానాలు లేవు. గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే మా ప్రభుత్వం ప్రకటించింది.
అందులో భాగంగానే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, వారి ఫిర్యాదుల పరిష్కారం, గుర్తింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిగారు 2024 డిసెంబరు 23న గిగ్ వర్కర్లు, సంబంధిత ప్రతినిధులతో సమావేశమయ్యారు.
వారితో పలుమార్లు సంప్రదింపులు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం అందుబాటులో ఉంచింది. దాదాపు 64 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం రూపొందించిన బిల్లును ఈ రోజు కేబినేట్ ఆమోదించింది.
కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభిస్తాయి. వీరందరి సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి హక్కులకు రక్షణ కల్పిస్తుంది.
గిగ్ వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది..
రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో గిగ్ వర్కర్ల సంక్షేమానికి కొంత ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ మంత్రివర్గం ప్రస్తుతం ఆమోదించిన బిల్లు జాతీయ స్థాయిలో మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది.
4. గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
15వ ఆర్ధిక సంఘం కాల పరిమితి వచ్చే 2026 మార్చ్ 31 తో ముగియనుంది. అప్పటిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూ. 3 వేల కోట్లు రాకుండా పోతాయి.
అందుకే ఈ డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది.
ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీం కోర్టు సూచనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల పరిమితి కి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది.
డెడికేటెడ్ కమిషన్ బీసీ లకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్ల జాబితాను ఇప్పటికే ఇచ్చింది. దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కోర్టు కేసులతో ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచి పోయింది.
ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని.. కేబినెట్ తీర్మానం చేసింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించింది.
5. ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి (RDR) ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 కెనాల్ అని పేరు మారుస్తారు.
6. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ ను మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు రూపొందించిన "హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(HILTP)"కి కేబినెట్ ఆమోదించింది.
7. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, డిసెంబర్ 8–9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబడనుంది.


