 
													సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తీవ్ర అభ్యంతరాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు నేపథ్యంతో ఈ ప్రమాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సీఈవో సుదర్శన్‌రెడ్డి బదులు కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఓ వర్గం ఓటర్లను ప్రలోభ పెట్టడమే అవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. అయితే ఎస్‌ఈసీ నిన్ననే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కేబినెట్ విస్తరణ పరిణామాలను, అభ్యంతరాలను అందులో వివరించింది. ఇవాళ మరోసారి సీఈసీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లోనే దీనిపై స్పందన వెలువడే అవకాశం ఉంది.
రాజ్‌భవన్‌లో మధ్యాహ్నాం 12.15గం. ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణం చేయించనున్నారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. అంతేకాదు.. ఈ ప్రమాణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ అజారుద్దీన్ పాల్గొంటారని తెలుస్తోంది. అయితే..
గతంలో గోవాలోనూ ఇలాగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్న టైంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. స్వయంగా సీఈసీనే అప్పటి సీఎం మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు కూడా. ఇదే విషయాన్ని నిన్న బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.
అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంతో మంత్రి పదవి ఇస్తుండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకు బీఆర్‌ఎస్ కూడా మద్దతు చెబుతోందని కాంగ్రెస్ మండిపడుతోంది.

ఏ శాఖ ఇస్తారో?
అజహరుద్దీన్ గనుక మంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో అనే చర్చా నడుస్తోంది. ప్రస్తుతం కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో అందులోంచి ఒకటి ఇస్తారా? లేదంటే ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల వద్ద నుంచి ఏదైనా అడ్జెస్ట్‌మెంట్ చేస్తారా? చూడాలి. 
ఇదీ చదవండి: ఆ బైపోల్ టైంలో మంత్రి పదవిని బీజేపీ ఎలా ఇచ్చింది?
కాంగ్రెస్‌లో అసంతృప్తి? 
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
