సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు కొత్తమంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు రాజ్ భవన్‌లో కేబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్, తదితర అంశాలపై అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్‌తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.


