ఎంఐఎం కోసమే గ్రూప్‌–1లో ఉర్దూ

Telangana: Bandi Sanjay Comments On CM KCR - Sakshi

బీజేపీ అధికారంలోకి రాగానే రద్దు: రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌  

జడ్చర్ల/జడ్చర్లటౌన్‌: గ్రూప్‌–1లో ఉర్దూలో పరీక్షరాసి ఉద్యోగాలు పొందిన వారిని తాము అధికారంలోకి రాగానే న్యాయపరమైన ప్రక్రియ ద్వారా తొలగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని కోడ్గల్‌ సమీపంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎంఐఎం మెప్పు కోసమే సీఎం కేసీఆర్‌ గ్రూప్‌–1 పరీక్షలో ఉర్దూ భాషను చేర్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను ఎంఐఎం పార్టీకి అమ్ముకుంటోందని విమర్శించారు. కేసీఆర్‌కు రాజ్యాంగంపై మాట్లాడే అర్హత లేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందన్నారు.

ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, వారి మధ్య పొత్తు కుదిరిందని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు ఈ అంశంపై చర్చిద్దామంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్ర–2 ముగింపు సభతో చరిత్ర సృష్టించబోతున్నామన్నారు.   

ఉమ్మడి పాలమూరులో ముగిసిన యాత్ర   
బీజేíపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం రాత్రి ముగిసింది. ఏప్రిల్‌ 14న జోగుళాంబ గద్వాల జిల్లాలో జోగుళాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉమ్మడి జిల్లాలో 26 రోజుల పాటు 326కి.మీ.మేర కొనసాగి, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఎక్వాయపల్లిలో ముగిసింది. పెద్ద ఆదిరాలలో రచ్చబండ నిర్వహించిన అనంతరం సంజయ్‌ ఎక్వాయపల్లి దాటి రంగారెడ్డి జిల్లా తొమ్మిదిరేకులలో బసచేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది.

రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలవాలి 
రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు సంకేతంగా నిలిచేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని సంజయ్‌ పిలుపునిచ్చారు. భారీగా జన సమీకరణ ద్వారా తెలంగాణలో సరికొత్త చరిత్రను సృష్టిద్దామని చెప్పారు.

‘ప్రజా సంగ్రామ యాత్ర–2’ముగింపు సందర్భంగా ఈ నెల 14న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహిస్తున్న అమిత్‌షా సభ ఏర్పాట్లపై సోమవారం జడ్చర్ల మండలం మక్తపల్లి గేట్‌ వద్ద సంజయ్‌ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఒక్కో డివిజన్‌ నుంచి వేలాది మంది ప్రజలు ముగింపు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top