ఎల్లలు దాటిన ‘రెవ్వ్‌ అప్‌’ : కేటీఆర్‌

Telangana AI Mission Selects 62 Start Ups For Revv Up: KTR - Sakshi

మూడో విడతలో 62 స్టార్టప్‌లు ఎంపిక   

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్టార్టప్‌లను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘రెవ్వ్‌ అప్‌’ దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు ఊతమివ్వడం హర్షణీయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇది తెలంగాణలోని ఆవిష్కరణల వాతావరణ బలాన్ని చాటడంతో పాటు స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు అద్దంపడుతోందన్నారు.

తెలంగాణ ఏఐ మిషన్‌ (టి–ఎయిమ్‌) ‘రెవ్వ్‌ అప్‌’ కార్యక్రమంలో భాగంగా మూడో విడతలో ఎంపిక చేసిన 62 స్టార్టప్‌లకు కేటీఆర్‌ ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. తెలంగాణలోని అనువైన వాతావరణాన్ని ఉపయోగించుకోవాలని ఏఐ రంగంలోని స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. ‘రెవ్వ్‌ అప్‌’ మూడో విడతలో 15 రంగాలకు చెందిన స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టి–ఎయిమ్‌ వెల్లడించింది.

స్మార్ట్‌ సిటీస్, వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాలకు చెందిన స్టార్టప్‌లను ఎంపిక చేయగా ఇందులో 13 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. ఎంపికైన స్టార్టప్‌లలో 20 శాతం మహిళల సారథ్యంలో నడుస్తున్నవే కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో నాస్కామ్‌ సహకారంతో టి–ఎయిమ్‌ ‘రెవ్వ్‌ అప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, రెండు విడతల్లో 140 ఏఐ స్టార్టప్‌లకు లబ్ధి చేకూరినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top