తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి
మంత్రి పొంగులేటి వెల్లడి
‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’పేరిట ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ప్రారంభం
నిరుద్యోగ యువతకు ఏడాది పాటు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు. ఇప్పటికే 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. లక్షలాది నిరుద్యోగులకు ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణను ఇప్పించడానికి ‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బుధవారం తన జన్మ దినం సందర్భంగా పీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’పేరిట అమలు చేస్తున్న ఆన్‌లైన్ శిక్షణను పొంగులేటి సచివాలయంలో ప్రారంభించి మాట్లాడారు. ‘పీఎస్‌ఆర్ యువ నేస్తం’ద్వారా ఎన్ని లక్షల మందికైనా ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు, శిక్షణ ఖర్చులు, దూరప్రాంతాల సమస్యలు యువత లక్ష్య సాధనకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు శ్రీకారం చుట్టామన్నారు.
ప్రతిష్టాత్మక ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఈ రోజు నుంచి ఏడాది పాటు ఈ ఉచిత శిక్షణ ఉంటుందని చెప్పారు. 2014లో తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత 2016లో ఖమ్మం ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని, 462 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు.
దీపావళిలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల తీపి కబురు
సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలిసిన సందర్భంలో పాత్రికేయుల ఇళ్ల స్థలాల అంశం చర్చకు వచ్చిందని పొంగులేటి తెలిపారు. వచ్చే దీపావళిలోగా ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. దీనిపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పుట్టినరోజున తమకు శుభవార్త వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, శిక్షణా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఆటంకాలు.. హైదరాబాద్‌లో పాదయాత్రలా?
ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు గతంలో తమ పాలనలో అనుసరించిన విధానాలను ఒకసారి గుర్తు చేసుకోవాలని పొంగులేటి అన్నారు. గతంలో నిరసనలు, ధర్నాలకు అవకాశం లేకుండా ఇందిరాపార్క్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాచౌక్‌ను పునరుద్ధరించి, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్రపై స్పందిస్తూ.. ఢిల్లీలో నిరసనలకు ఆటంకాలు కల్పిస్తూ, తెలంగాణలో పాదయాత్రలు చేపట్టాలని బీజేపీ నాయకులు భావించడం ఏమిటని ప్రశ్నించారు.
‘సర్’పై సమగ్ర పునఃపరిశీలన జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ మేరకు నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పిలుపునిచ్చాయని, దీంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైలు బోగీలు కేటాయించాలని కోరినా కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు. రైల్వే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సొత్తు కాదని, భారత ప్రజల ఆస్తి అని మంత్రి అన్నారు.
ఇదీ చదవండి: మోడల్ స్కూళ్లలో 776 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది


