మోడల్‌ స్కూళ్లలో 776 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది | Telangana To Recruit 776 Outsourcing Staff For 194 Model Schools With Salaries Up To Rs 22,750 Per Month | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూళ్లలో 776 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

Oct 29 2026 9:07 AM | Updated on Oct 29 2026 11:01 AM

Telangana Model Schools 776 Outsourcing Jobs

ఆర్ట్, యోగా, కంప్యూటర్‌ టీచర్లు, లైబ్రేరియన్ల నియామకం

ఆర్ట్, యోగా, కంప్యూటర్‌ టీచర్లకు రూ.22,750 వేతనం

లెబ్రేరియన్లకు రూ.19,500 చొప్పున చెల్లింపు

జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 194 మోడల్‌ స్కూళ్లలో నాలుగు కేటగిరీలకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక్కో పాఠశాలలో ఒక ఆర్ట్‌ టీచర్, ఒక యోగా టీచర్, ఒక కంప్యూటర్‌ టీచర్, ఒక లైబ్రేరియన్‌ను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ అక్టోబర్‌ 20న జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. 

మేడ్చల్‌–మల్కాజిగిరి, జోగుళాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, హైదరాబాద్‌ మినహా మిగిలిన జిల్లాల కలెక్టర్లు నియామక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి ప్రకారం ఈ నియామకాలు నవంబర్‌ 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు.. ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగుతాయి.

అర్హులైన అభ్యర్థులను ఇప్పటికే ఉన్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా లేదా కొత్త ఏజెన్సీల ద్వారా నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్ట్‌ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్‌ టీచర్‌కు నెలకు రూ.22,750 చొప్పున, లైబ్రేరియన్‌కు రూ.19,500 చొప్పున వేతనం నిర్ణయించారు. మొత్తం 194 పాఠశాలల్లో నాలుగు పోస్టుల చొప్పున 776 పోస్టులు అందుబాటులోకి రానున్నాయి.

అర్హతలివీ..: ఆర్ట్‌ టీచర్‌ పోస్టుకు ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు పెయింటింగ్, శిల్పకళ, కమర్షియల్‌ ఆర్ట్స్, ప్రింట్‌ మేకింగ్, యానిమేషన్‌ వంటి విభాగాల్లో అర్హత ఉండాలి. యోగా టీచర్‌ పోస్టుకు గ్రాడ్యుయేషన్‌తోపాటు యోగాలో డిప్లొమా లేదా డిగ్రీ, యోగా స్పెషలైజేషన్‌తో బీఎడ్‌/బీపెఎడ్‌ అర్హతల్లో పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్‌ టీచర్‌ పోస్టుకు కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, బీటెక్, బీఈ, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌ వంటి అర్హతలు ఉండాలి.

లైబ్రేరియన్‌ పోస్టుకు లైబ్రరీ సైన్స్‌ లేదా లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీ అవసరం. నాలుగు పోస్టులకూ కనీస వయోపరిమితి 21 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వరకు విద్యార్థులకు యోగా, కళలు, కంప్యూటర్‌ విద్యను అందించడం ఈ నియామకాల ప్రధాన ఉద్దేశం. కంప్యూటర్‌ టీచర్లు తరగతుల స్థాయిని బట్టి ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్, ఇంటర్నెట్‌ భద్రత, ప్రోగ్రామింగ్, డేటా హ్యాండ్లింగ్, వెబ్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాలను బోధించాలి.

లైబ్రేరియన్లు పుస్తకాల నిర్వహణ, విద్యార్థులకు సమాచార వనరుల అందుబాటు, డిజిటల్‌ వనరుల వినియోగంపై దృష్టి సారించాలి. నియామకాలు నిర్దేశించిన అర్హతలు, వయోపరిమితి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: ధరలు అసాధారణంగా పెరిగితే జోక్యం చేసుకుంటాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement