భవిష్యత్తులో బియ్యం కొరత ఆందోళనతోనే ధరల పెరుగుదల
నిత్యావసరాల ధరలు అసాధారణంగా పెరిగితే మార్కెట్‌లో జోక్యం చేసుకుంటాం
వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సరిపడా బియ్యం నిల్వలు
‘సాక్షి’ఇంటర్వ్యూలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
సాక్షి, హైదరాబాద్: కరువు ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగు తగ్గొచ్చనే అంచనాలు, భవిష్యత్‌లో బియ్యం కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే ఫైన్ రకం బియ్యం ధరలు 15 శాతం వరకు పెరిగాయని, జైశ్రీరామ్ వంటి సూపర్ ఫైన్ రకాల ధరలు అంతకంటే కొంత ఎక్కువగా పెరిగాయన్నారు. అయితే రాష్ట్రంలో బియ్యం కొరత లేదని, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగితే మార్కెట్‌లో జోక్యం చేసుకొని నియంత్రణ చర్యలు చేపడతామని చెప్పారు. పౌరసరఫరాల శాఖ పనితీరు, ధరల నియంత్రణ, రేషన్ పంపిణీ తదితర అంశాలపై ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
బియ్యంతోపాటు పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది?
- మార్కెట్‌లో డిమాండ్, సరఫరాను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగితే వాటిని అదు పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. బియ్యంతోపాటు మరో 40 నిత్యావసర వస్తువుల నిల్వలు, సరఫరా, ధరల ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ధరల నియంత్రణకు అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేపడతాం. బియ్యం విషయంలోనూ కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వలు ఉంచడం వంటి చర్యలను సహించేది లేదు. అవసరాన్ని బట్టి సరఫరాను పెంచి ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రంలో బియ్యం కొరత ఉందా? ధరలు పెరుగుతాయనే భయంతో ప్రజలు అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్నారా?
- రాష్ట్రంలో బియ్యం కొరత లేదు. పౌరసరఫరాల శాఖ వద్ద వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయి. ధరలు అసాధారణంగా పెరిగి, అవసరం ఏర్పడితే ప్రభుత్వ నిల్వల నుంచి బియ్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
అయితే అలాంటి పరిస్థితి వస్తుందని భావించడం లేదు. ఎల్‌నినో కారణంగా ఈ సీజన్‌లో వరి సాగు తగ్గొచ్చని, యాసంగిలోనూ సాగు తగ్గుతుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. దీంతో అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుండటం కూడా డిమాండ్ పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల పెరుగుదల ప్రభా వం పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నాం.
రేషన్ బియ్యాన్ని కొందరు తిరిగి సేకరించి తక్కువ ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రీసైక్లింగ్‌ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
- అక్కడక్కడ రేషన్ బియ్యం దారిమళ్లుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే రేషన్ బియ్యం రీసైక్లింగ్ గణనీయంగా తగ్గింది. అయినా, అక్రమ రవాణా, మిల్లుల్లో అక్రమాలపై నిఘా కొనసాగిస్తున్నాం.
పప్పులు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామన్న మంత్రి ఉత్తమ్ ప్రతిపాదనపై శాఖాపరంగా ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు?
- ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తే ఎంత వ్యయం అవుతుంది, వాటిని ఏవిధంగా ప్రజలకు చేరవేయొచ్చు అనే అంశాలపై నివేదిక రూపొందించాం. ఏయే వస్తువులను పంపిణీ చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి అనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇదీ చదవండి: తాగునీటి సమస్య తలెత్తొద్దు


