డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంత్రులు వాకిటి ఉత్తమ్, పొంగులేటి
ప్రజలను, పశువులను, పంటల్ని కాపాడేందుకు చర్యలు చేపడతాం
లభ్యతను బట్టి సాగుకు నీరు.. తాగునీటికి డెడ్ స్టోరేజీల నుంచీ సరఫరా
కరువు ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 112
అఖిలపక్ష భేటీలో పార్టీల ప్రతినిధులకు ప్రభుత్వ ప్రజెంటేషన్
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళంలో కరువు పరిస్థితులు
తెలంగాణలో సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం
23.40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి
భూగర్భ జలాల్లేవు.. కరెంటుకు గరిష్ట డిమాండ్.. నీటి సరఫరా మెరుగుకు నవంబర్ 15–డిసెంబర్ 31 మధ్య ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్‌లో మూడు రోజులకోసారి నీటి సరఫరా ఉండొచ్చు
బియ్యం నిల్వలు 2027 అక్టోబర్ వరకు సరిపోతాయి..
డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన సచివాలయంలో అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడబోయే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరువులో ప్రజలు, పశువులు, పంటలు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది. లభ్యతను బట్టి సాగు కోసం నీటిని విడుదల చేస్తామని, అవసరమైతే జలాశయాల డెడ్ స్టోరేజీల నుంచి కూడా తాగునీటి కోసం తీసుకుంటామని స్పష్టం చేసింది. కరువులో పేదలకు ఆకలి సమస్య రాకుండా చర్యలు చేపడతామని, వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరాకు అవసరమైన బియ్యం అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలకు ప్రభుత్వం ఈ మేరకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచి్చంది. ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో, రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని, రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను వివరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో విద్యుత్‌కు ఏర్పడిన డిమాండ్‌ను ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వ శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను వెల్లడించింది.
ప్రపంచ పరిస్థితి ఇదీ..
2026–27లో ఎల్‌నినో ఫ్రభావం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 దేశాల్లో సాధారణ పరిస్థితులకు భిన్నమైన వర్షపాతం నమోదైంది. తద్వారా ఆయా ప్రాంతాల్లో కరువులు, వరదలు, వడగాలులు, రుతుపవనాల అస్థిరత, వ్యవసాయ దిగుబడుల తగ్గుదల లాంటి సమస్యలు వస్తాయి. జింబాబ్వే, జాంబియా, మలావి, మొజాంబిక్ లాంటి దక్షిణాఫ్రికా దేశాలు, దక్షిణాసియా, పశి్చమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ప్రతికూల ప్రభావం వలన వ్యవసాయం, ఆహార భద్రత దెబ్బతినే అవకాశముంది.
దేశంలో ఇలా..
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, 12.6 శాతం తక్కువగా 759.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు రాష్ట్రాల్లో పంటల ఎదుగుదల, వ్యవసాయ ఉత్పాదకత, నేలలో తేమ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జలాశయాల్లో నీటి నిల్వలు, తాగునీటి లభ్యతకు ప్రతికూల అవకాశాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో 21 జిల్లాల్లోని 388 మండలాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో 265 తాలూకాలు కరువు ప్రభావానికి గురయ్యాయి. కేరళలో నీటి లభ్యత, వ్యవసాయ పరిస్థితులపై ఆందోళన పెరిగింది.
తెలంగాణలో..
⇒ రాష్ట్రంలో సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 2026, జూన్ 1 నుంచి అక్టోబర్ 28 వరకు కురవాల్సిన 826.2 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను కేవలం 619.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అక్టోబర్‌లో ఇప్పటివరకు ఒక్క వర్షపు రోజు కూడా నమోదు కాలేదు.
⇒ తద్వారా సాధారణం కంటే నీటి నిల్వలు 62 శాతం తక్కువయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ సమయానికి 470.2 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉంటే ఇప్పుడు కేవలం 179.6 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
⇒ 2025 ఖరీఫ్ సీజన్‌లో 139.28 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగితే, 2026 ఖరీఫ్ సీజన్‌లో 126.06 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఇందులోనూ 18.6 శాతం అంటే 23.40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
⇒ రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 621 మండలాల్లో కరువు పరిస్థితి అత్యంత తీవ్రంగా, తీవ్రంగా, మోస్తరుగా ఉంది. సింగూరు ప్రాజెక్టు నిల్వలు 10.73 శాతానికి తగ్గిపోయాయి. మొత్తం 29.91 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 3.21 టీఎంసీలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది. ఈ నిల్వలు డిసెంబర్ 10 వరకు మాత్రమే సరిపోతాయి.
⇒ ఇక ఈ ఏడాది చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈనెల 16వ తేదీన ఏకంగా 20,018 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. అన్ని పరిస్థితులను అంచనా వేసి రాష్ట్రంలోని 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సి వచి్చంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శాఖల వారీగా చేపడుతున్న చర్యలివే..
వ్యవసాయ శాఖ
రాష్ట్రంలో 23.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో పత్తి (15.88 లక్షలు), వరి (4.79 లక్షలు), కందులు (1.58 లక్షలు), మొక్కజొన్న (0.70 లక్షలు), మిరప (0.14 లక్షల) ఉన్నాయి. రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. రైతు భరోసా కింద ఈ సీజన్‌లో ఇప్పటికే 70.40 లక్షల మంది రైతులకు రూ.8,759.60 కోట్లు చెల్లించాం. పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి, పచ్చి రొట్ట విత్తనాలను సబ్సిడీలపై పంపిణీ చేశాం. ప్రత్యేక ఎల్‌నినో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. రైతు వేదికలు, గ్రామసభలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు సూచనలివ్వడం ద్వారా అవగాహన కలి్పస్తున్నాం.
పశుసంవర్థక శాఖ
వర్షపాతం లోటు కారణంగా పశువులకు గ్రాసంతో పాటు నీటి లభ్యత తగ్గుతోంది. ఎండు పశుగ్రాసం ధర రూ. 600 నుంచి రూ.900కు పెరిగింది. ఈ పశుగ్రాస కొరతను నివారించేందుకు గాను సామూహిక, వ్యక్తిగత సాగు కోసం 2,044 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 1,600 చాప్ కట్టర్లు, 4.65 లక్షల పాలిచ్చే పశువులకు మినరల్ మిక్చర్ అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటికే ఉన్న 4,600 నీటి తొట్టెలకు మరమ్మతులు చేయడంతో పాటు అదనంగా 9,989 తొట్టెలు ఏర్పాటు చేస్తున్నాం.
సాగునీటి శాఖ
రాష్ట్రంలో నీటి నిల్వలు అత్యంత తక్కువగా ఉన్నాయి. తద్వారా 30.56 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అందుబాటులో ఉన్న నీటిని బట్టి దాదాపు 7 లక్షల ఎకరాలకు అవసరమైన 47 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రతిపాదిస్తున్నాం. వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటిని రిజర్వు చేయడంతో పాటు సాగునీటి విడుదలను వాయిదా వేయడం, ఆరుతడి పంటలకు కూడా మిగులు నీరు ఉంటేనే నీటిని విడుదల చేయడం, చెరువులు, ఇతర జలవనరుల పునరుద్ధరణ పనులు చేపట్టడం లాంటి చర్యలు తీసుకుంటున్నాం.
భూగర్భ జలశాఖ
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు లోటు వర్షపాతం ఏర్పడే అవకాశముంది. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో వరి, చెరుకు లాంటి అధికనీటి పంటల సాగును వీలైనంత నివారించాలి. తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి. భూగర్భ జలాలను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలి.
పౌరసరఫరాల శాఖ
రాష్ట్రంలో ప్రజా పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు గాను నెలకు 2.38, ఏడాదికి 28.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. గోదాముల్లో ఇప్పటికే 10.17 ఎల్‌ఎంటీలున్నాయి. మిల్లర్ల వద్ద 27.13 ఎల్‌ఎంటీలు, వడ్ల నుంచి రావాల్సిన 18.18 ఎల్‌ఎంటీలు కలిపితే 28.35 ఎల్‌ఎంటీల బియ్యం ఉంటాయి. ఈ నిల్వలు 2027 అక్టోబర్ వరకు సరిపోతాయి.
గ్రామీణ నీటి సరఫరా
ఈ పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే కొత్త బోర్‌వెల్స్‌కు అనుమతి, చేతి పంపులు, బావులు, స్థానిక నీటి పథకాలు పనిచేసేలా చూడడం, అవసరాన్ని బట్టి అత్యవసర పంపులతో జలాశయాల్లోని డెడ్‌స్టోరేజీ నీటిని తీసుకోవడం, బావులను అద్దెకు తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరా వ్యవస్థల పనితీరును మెరుగుపరిచేందుకు గాను ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 31 డిసెంబర్ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నాం.
హైదరాబాద్ నీటి సరఫరా
సింగూరు జలాశయంలో నీటి లభ్యత లేని కారణంగా సాధారణ నీటి ప్రవాహాలు పునరుద్ధరించేంత వరకు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు మూడు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేయాల్సి రావచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయ సరఫరా అవసరం ఏర్పడింది. గోదావరి నుంచి 40, కృష్ణా నీటి సరఫరా సర్దుబాటు, అదనపు పంపింగ్ ద్వారా 15, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల వద్ద అదనపు ఫిల్టరేషన్ ద్వారా 5 ఎంజీడీలు (రోజుకు మిలియన్ గ్యాలన్లు) కలిపి మొత్తం 60 ఎంజీడీల తాగునీటి సరఫరాకు ప్రతిపాదించాం.
ఉపాధి హామీ (వీబీజీ రామ్‌జీ)
⇒ ప్రతి గ్రామ పంచాయతీ లేదా ఆవాసం పరిధిలో 200 శాతం పనుల జాబితాను సిద్ధం చేయాలి. ఇప్పటికే ఉన్న 9.1 లక్షల పనులతో పాటు 8 లక్షల అదనపు పనులను గుర్తించాం. వ్యవసాయ కుంటలు, సోక్ పిట్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్స్ రీచార్జ్, పశువుల నీటి తొట్టెలు, పశుగ్రాస సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పశువులు, మేకలు, కోళ్ల షెడ్లు, కూరగాయల పందిళ్లు, నర్సరీలు వంటి జీవనోపాధి ఆస్తుల కల్పనను కూడా ప్రోత్సహిస్తాం.
⇒ విద్యుత్ శాఖ: గత మూడు నెలల కాలంలో మొత్తం 1,263 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నమోదైంది. అసాధారణంగా పెరిగే డిమాండ్ నిర్వహిస్తూనే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం. ఉదయం, సాయంత్రం వేళల్లో, నీటి పంపింగ్‌కు అవసరమైన విద్యుత్‌పై దృష్టి పెడతాం.
⇒ వైద్య, ఆరోగ్య శాఖ: వేడి వాతావరణం నుంచి ప్రజలకు రక్షణ సూచనలు, శరీరంలో నీరు, లవణాల లోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలి. పని స్థలాల్లో నీడ కలి్పంచాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య కఠిన పనులు చేయొద్దు. అన్ని ప్రాథమిక ఆరోగ కేంద్రాల్లో జింక్, ఐవీ ఫ్లూయిడ్స్, క్లోరిన్ మాత్రలు అందుబాటులో ఉంచాలి. విరేచనాలు, జ్వరాల కేసులు పెరగకుండా వ్యాధుల పర్యవేక్షణను వారానికోసారి సమీక్షించడం, రోజువారీ నివేదికలు తెప్పించడం, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను సమర్థంగా వినియోగించుకోవడం, ఓఆర్‌ఎస్ కేంద్రాల ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టాలి. విపత్తు నిర్వహణ శాఖలోని రాష్ట్ర స్థాయి వార్ రూమ్ తక్షణ సమన్వయానికి సహాయపడడంతో పాటు ఎల్‌నినో ఫిర్యాదుల కోసం 112 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.


