
ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న చీఫ్ జస్టిస్ బెంచ్
తెలంగాణ స్పీకర్‌కు కాలపరిమితి విధించిన సుప్రీం కోర్టు
తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ
ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావన్న సీజేఐ బీఆర్ గవాయ్
తెలంగాణ హైకోర్టు తీర్పు కొట్టివేత
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు
న్యాయస్థానమే వేటు వేయాలన్న పాడి కౌశిక్‌రెడ్డి విజ్ఞప్తి తిరస్కరణ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అలాగే.. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి(మూడు నెలలు) విధిస్తున్నట్లు పేర్కొంది.
ఏళ్ల తరబడి ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదన్న భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్.. ఆ పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అని తీర్పు వెల్లడించారు. అదే సమయంలో న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. ‘అపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అనే సూత్రం వర్తించకూడదని వ్యాఖ్యానించింది.
పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంట్ ఆలోచించాలి. న్యాయస్థానం విచారణ మొదలుపెట్టాకే.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మేము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా ? లేదా అని ఆలోచించాలి. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు మంచివి కావు అని సీజేఐ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారాయన.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్.. అటుపై అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది.
హైకోర్టులో ఎదురుదెబ్బ టు సుప్రీం కోర్టు తీర్పు దాకా.. అనర్హత పిటిషన్ల టైం లైన్
- 2024 ఏప్రిల్‌లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు
- 09.09.2024.. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి జస్టిస్ బి విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ ఆదేశం.
- 22.11.2024.. హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.. రీజనబుల్ టైం కావాలంటూ వ్యాఖ్య. స్పీకర్‌కు షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
- జనవరి 2025.. హైకోర్డు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, వివేకానంద
- 10.02.2025.. పార్టీల హక్కులు నిర్లక్ష్యం చేయబడకూడదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ‘రీజనబుల్ టైం’ అంటే ఎంత? అని ప్రశ్నించింది.
- 18.02.2025.. సుప్రీం కోర్టు తదుపరి విచారణకు తేదీ నిర్ణయించింది, స్పీకర్ సమాధానం కోసం వేచి చూసింది.
- 2025 మార్చి 4 – కోర్టు స్పీకర్, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
- 03.04.2025.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
- 31.07.2025.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు కాలపరిమితి విధిస్తూ మరీ సుప్రీం కోర్టు తుది తీర్పు