
సాక్షి, ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమవారం విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు సిట్‌కు కీలక వ్యాఖ్య చేసింది. దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై కోర్టు స్పందించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ సిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
‘‘ప్రభాకర్ రావు సిట్ దర్యాప్తుకు సహకరించడం లేదు. ఫోన్ డివైస్‌లలో డాటా ఫార్మట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫోన్ డివైస్‌లో సమాచారం ధ్వంసం చేశారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక కూడా ఇచ్చింది. జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను కూడా ఆయన టాప్ చేశారు. ప్రభుత్వ ఫోన్‌లో పాస్వర్డ్ సైతం చెప్పడం లేదు. ఈ తరుణంలో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను తొలగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
దీనికి ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ.. ఇప్పటికే తన క్లయింట్ చాలాసార్లు సిట్ విచారణకు హాజరయ్యాని.. సహకరించడం లేదన్నదాంట్లో వాస్తవం లేదని అన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆరోపణలపై స్పందించేందుకు రెండు వారాల సమయం కోరారాయన. దీంతో.. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
తదుపరి విచారణ దాకా ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని చెబుతూ.. మధ్యంతర ఊరటను పొడిగించింది. అలాగే విచారణకు సహకరించాల్సిందేనని ప్రభాకర్‌రావుకు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో.. ఇంటరాగేట్ చేసి ఆయన నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌కు సూచించింది.