దేశరక్షణకు దన్ను | A story about the Ordnance Factory in Eddumailaram | Sakshi
Sakshi News home page

దేశరక్షణకు దన్ను

Jan 27 2025 4:51 AM | Updated on Jan 27 2025 4:51 AM

A story about the Ordnance Factory in Eddumailaram

రక్షణ రంగ ఆయుధ సంపత్తిలో మిన్న.. 

తెలంగాణకు తలమానికం.. ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం 

కార్గిల్‌ యుద్ధంలో ఆయుధాల కొరతను తీర్చిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న రోజులవి.. కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్‌ చొరబాటుదారులను తరిమికొట్టేందుకు 1999లో సైనికులు భీకర పోరు సాగిస్తున్నారు.. రక్షణ దళాలకు అకస్మాత్తుగా ఆయుధ కొరత తలెత్తింది.. బోఫోర్స్‌ వంటి ఆయుధాలు అత్యవసరంగా కావలసి వచ్చింది.. 

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ దళాలకు ఆయుధ సంపత్తిని ఆగమేఘాల మీద అందించి పాకిస్తాన్‌ చొరబాటుదారులను తరిమికొట్టడంలో తన వంతు పాత్ర పోషించిన ఘన చరిత్ర ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీకి ఉంది. దేశ రక్షణ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఈ ఆయుధ కర్మాగారంప్రస్తానంపై.. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 

ఆయుధ సంపత్తి ఇలా.. 
తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో బీఎంపీృ2 (సారథి) వంటి ఇన్‌ఫ్యాంట్రీ కాంబాట్‌ యుద్ధ ట్యాంకులను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి బీఎంపీ యుద్ధ ట్యాంకులను సుమారు మూడు వేల వరకు ఉత్పత్తి చేసి దేశ రక్షణ రంగానికి అందించారు. 

భూమిమీద, నీటిలోనూ తేలియాడేలా ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ యుద్ధ ట్యాంకులతో ఏటా సమీపంలోని చెరువులో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తుంటారు. కేవలం ఆర్మీకే కాదు, నౌకా దళానికి అవసరమైన సీఆర్‌ఎన్‌ృ91 వంటి నావెల్‌గన్‌లు కూడా ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుంటాయి. షిప్‌లపై అమర్చే ఈ గన్‌లను సుమారు వంద వరకు ఉత్పత్తి చేశారు. 



రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం.. 
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్స్‌ కోసం అవసరమైన దళాలను తరలించేందుకు అవసరమైన ప్రత్యేక వాహనాలు, మందు పాతర్లను తట్టుకునే సామర్థ్యం కలిగిన మైన్స్‌ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌ను కూడా ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలోని ఆర్‌అండ్‌డీ విభాగం అభివృద్ధి చేసింది. సుమారు వెయ్యికి పైగా ఇలాంటి మైన్స్‌ ప్రొటెక్టెడ్‌ వెహికల్స్‌ను తయారు చేసింది. 

1987 నుంచి ఉత్పత్తి 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ కాలంలోనే ఇలాంటి ఆయుధ కర్మాగారాలు పనిచేశాయి. ఆ తర్వాత దేశ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ తయారీకి ఆర్డినెన్స్‌ కర్మాగారాలను నెలకొల్పారు. అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌ జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో 1984లో ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

1987 నుంచి ఈ కర్మాగారంలో యుద్ధట్యాంకుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో.. ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఒకటి. ఇక్కడ సుమారు మూడు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశంలోని 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను ఏడు డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

యుద్ధట్యాంకుల ట్రయల్‌ రన్‌.. 
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారైన బీఎంపీృ2, బీఎంపీృ2 ఓవర్‌హాల్ట్‌ వంటి యుద్ధట్యాంకులకు 2024 డిసెంబర్‌ 13న కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చెరువులో ట్రయల్‌రన్‌ నిర్వహించారు. 

భూమిపైనా నీటిలోనూ నడిచే యుద్ధట్యాంకర్ల నుంచి మిసైల్‌ లాంచర్‌ సదుపాయం కూడా వీటికి ఉంటుందని ఓడీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు. స్మోక్‌గ్రనేడ్‌ లాంచర్, ఆర్మర్‌స్టీల్‌తో ఆల్‌రౌండ్‌ ఫైర్‌ ప్రొటెక్షన్‌ వంటి సదుపాయాలున్న ఈ ట్యాంకుల ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో.. వాటిని రక్షణ శాఖకు అప్పగిస్తారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement