TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఇక స్నాక్‌ బాక్స్‌.. స్పెషల్‌ ఏంటంటే?

Snack Box For Passengers Along With Ticket In TSRTC Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌ టికెట్‌తో పాటే ‘స్నాక్‌ బాక్స్‌’ను ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ ఈ-గరుడ బస్సుల్లో స్నాక్‌ బాక్స్‌ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది. ఈ స్నాక్‌ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

‘ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్‌ఆర్టీసీ ముందుకు వెళుతోంది. అందులో భాగంగా స్నాక్‌ బాక్స్‌ ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్‌తో కూడిన స్నాక్‌ బాక్స్‌ను ప్రయాణికులకు సంస్థ అందించనుంది. టీఎస్‌ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకువచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్‌ విధానాన్ని అలాగే అదరించాలి’ అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ కోరారు.

ప్రతీ స్నాక్‌ బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్‌ చేసి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫీడ్‌ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని స్నాక్‌ బాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల ఫీడ్‌ బ్యాక్‌ను బట్టే మిగతా సర్వీసులకు స్నాక్ బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: రేపు సీఎం కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ భేటీ.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top