మోకాలి శస్త్రచికిత్స తర్వాత జాతీయ క్రీడల్లో రజత పతకం | Sepak Takraw Player Navatha Won Silver After Ligament Treatment | Sakshi
Sakshi News home page

మోకాలి శస్త్రచికిత్స తర్వాత జాతీయ క్రీడల్లో రజత పతకం

Sep 23 2025 7:04 PM | Updated on Sep 23 2025 7:54 PM

Sepak Takraw Player Navatha  Won Silver After Ligament Treatment
  • సెపక్‌తక్రా క్రీడాకారిణి నవత విజయగాథ
  • శిక్షణలో ఉండగా పూర్తిగా దెబ్బతిన్న ఏసీఎల్
  • సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స, ఫిజియోథెరపీ
  • కోలుకుని క్రీడల్లో తిరిగి మెరిసిన యువతి

హైదరాబాద్ చిన్ననాటి నుంచే సెపక్‌తక్రా ఆటగాళ్లలో ఒకరుగా ఎదిగారు నవత. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్న ఆమె, 2024 ఆసియా క్రీడల్లో పాల్గొనాలనే లక్ష్యంతో గోవాలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అయితే, శిక్షణ సమయంలో మోకాలికి తీవ్ర గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని అధిగమించి, మళ్లీ తిరిగి బరిలోకి దిగి ఈసారి జాతీయ స్థాయిలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోస్కోపి, జాయింట్ రీప్లేస్‌మెంట్ మరియు స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ హరిప్రకాష్ ఆమె చికిత్స గురించి వివరించారు.

“నవత శిక్షణలో ఉండగా మోకాలికి తీవ్రమైన గాయం అయ్యింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో, ఇంటర్నెట్‌లో అన్వేషించి మమ్మల్ని సంప్రదించారు. పరీక్షల తర్వాత ఆమెకి ఉన్న గాయం – పూర్తిగా నాశనమైన ఏసీఎల్ (యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్) అని నిర్ధారించాం. ఇది మోకాలిలో ప్రధాన లిగమెంట్‌లలో ఒకటి. గాయం తీవ్రంగా ఉండటంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

మొదట వాపు తగ్గేందుకు రెండు వారాల పాటు వేచి ఉన్నాం. అనంతరం ఆమె తన మోకాలిలో ఉండే మరో లిగమెంట్‌ను తీసుకుని మళ్లీ అమర్చాం. ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకుని తిరిగి ఆటను ప్రారంభించారు. అంతకుమించి, జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఆనందదాయకం. తొడ నుండి లిగమెంట్ తీసుకుంటే శరీరానికి ఎలాంటి హాని ఉండదు. పైగా శరీరం త్వరగా అంగీకరిస్తుంది. కృత్రిమ లిగమెంట్లను ఉపయోగిస్తే అంగీకారం కొంత ఆలస్యం అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ లిగమెంట్లు దెబ్బతినినప్పుడు మాత్రమే కృత్రిమ లిగమెంట్లు ఉపయోగిస్తాం.

గాయాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. అప్పుడు ఏసీఎల్ మాత్రమేనా, లేక మెనిస్కస్ గానీ, కార్టిలేజ్ గానీ దెబ్బతిన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. లిగమెంట్ గాయాలు అయితే వాపు తగ్గిన తర్వాతే శస్త్రచికిత్స చేస్తాం. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ కూడా ఎంతో కీలకం” అని డాక్టర్ హరిప్రకాష్ తెలిపారు.

తిరిగి ఆడగలనని అనుకోలేదు: నవత
“ఆసియా క్రీడలలో ఆడే అవకాశానికి చాలా ఉత్సాహంగా గోవాలో శిక్షణలో పాల్గొన్నాను. కానీ అక్కడ మోకాలికి గాయం కావడంతో ఎంతో షాక్‌కి లోనయ్యాను. వెంటనే బెస్ట్ స్పోర్ట్స్ సర్జన్ ఎవరో ఇంటర్నెట్‌లో వెతికాను. అప్పుడే కిమ్స్‌లో డాక్టర్ హరిప్రకాష్ పేరును చూశాను. మా సొంత ఊరు ఇక్కడే కావడంతో వెంటనే ఆస్పత్రికి వచ్చి చూపించుకొని శస్త్రచికిత్స చేయించుకున్నాను.

ఆ తర్వాత ముంబైలో ఆదాయపన్ను శాఖలో ఉద్యోగం రావడంతో ఫిజియోథెరపీకి ఎక్కువ సెలవులు తీసుకోలేకపోయాను. అందువల్ల కోలుకోవడానికి సుమారు 8–10 నెలలు పట్టింది. తర్వాత నెమ్మదిగా తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 2024 అక్టోబర్, నవంబర్ నెలల నుంచి తిరిగి శిక్షణ కొనసాగించాను.

సెపక్‌తక్రా అనేది లెగ్ వాలీబాల్ లాంటి ఆట. చెయ్యి తాకితే ఫౌల్ అవుతుంది. మోకాళ్లతో ఎక్కువ పనివుంటుంది. అటువంటి ఆటను మోకాలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఆడగలనని నేను అనుకోలేదు. కానీ డాక్టర్ చేసిన శస్త్రచికిత్స విజయవంతంగా జరగడంతో నేను పూర్తిగా కోలుకుని జాతీయ స్థాయిలో పతకం సాధించగలిగాను” అని నవత ఆనందం వ్యక్తపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement