పాఠాలు సరే.. ప్రణాళికేది?

School Education Annual Plan Unconfirmed Even the teaching begins - Sakshi

బోధన ప్రారంభమైనా ఖరారు కాని పాఠశాల విద్యా వార్షిక ప్రణాళిక 

కనీసం ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టని విద్యాశాఖ 

బోధన కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువు 

ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో బడులు తెరుచుకోకున్నా ఆన్‌లైన్, వీడియో పద్ధతిలో బోధనతో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటివరకు పాఠశాల విద్యా వార్షిక ప్రణాళిక (అకడమిక్‌ క్యాలెండర్‌) జాడలేదు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ఏడాదిలో చేపట్టే అన్ని బోధన కార్యక్రమాలు, పరీక్షలు, సెలవులు, వాటి కాలపట్టికతో అడకమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం విద్యాశాఖకు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి క్యాలెండర్‌ లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. 

పరీక్షలెప్పుడు... సెలవులెప్పుడు...? 
సాధారణంగా జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతే... ఆగస్టులో సమ్మేటివ్‌–1 పరీక్షలు, నిర్ణీత వ్యవధిలో ఫార్మేటివ్‌–1 పరీక్షలను నిర్వహించేవారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌ తరగతులు నెలరోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. 2021–22 విద్యా సంవత్సరం ప్రారంభ, ముగింపు తేదీలను కూడా అధికారులు స్పష్టం చేయలేదు. పైగా అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడంతో పరీక్షల నిర్వహణపైనా స్పష్టత కరువైంది. పాఠ్యాంశ బోధన ఏ ప్రాతిపదికన నిర్వహించాలి, ఏయే చాప్టర్లను ఏయే సమయంలో పూర్తిచేయాలో ఉపాధ్యాయులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులిస్తారు? పాఠశాలల చివరిరోజు ఎప్పుడనే దానిపైనా గందరగోళం ఏర్పడింది. 

క్యాలెండర్‌ ఊసేది? 
పాఠశాల విద్యా వార్షిక ప్రణాళిక రూపకల్పనలో ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. పాఠశాల విద్యాశాఖ సూచనలకు అనుగుణంగా కాలపట్టిక ఖరారు చేస్తారు. కానీ 2021–22 విద్యా వార్షిక ప్రణాళిక రూపకల్పనపై అటు పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఇటు ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు చేయలేదని తెలు స్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ప్రారంభించలేదనే అభిప్రాయాన్ని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో వ్యక్తం చేయడం గమనార్హం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top