సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది ఉమా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు చెబుతున్నారు.
Click here for the list of Passengers Details
హైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.

పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులు
హైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్‌తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌ను కోరుతున్నా అని అన్నారు.
#WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS
— OTV (@otvnews) November 17, 2025
స్పందించిన విదేశాంగ శాఖ
సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని డిప్యూటీ అంబాసిడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి.


